Jammu And Kashmir Encounter : జమ్ముకశ్మీర్‌లోని దొడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఆర్మీ అధికారితో సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు కూడా గాయపడ్డారు. సోమవారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులకు, సైనికుల మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక ఆర్మీ అధికారి, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ నలుగురు జవాన్లు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ము కశ్మీర్ పోలీసులు కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటలకు ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు తెగబడ్డారని, భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒక ఆర్మీ అధికారి, నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత దోడా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
#WATCH | J&K: The Indian Army uses a helicopter to carry out a search operation in the forests of Doda as the hunt for terrorists in the region is on.
— ANI (@ANI) July 16, 2024
Four Indian Army personnel including an Officer have been killed in action during an encounter with terrorists in Doda. pic.twitter.com/a7ydfOgusG
సైనిక వాహనంపై దాడి
గతవారం కథువా జిల్లాలో సైనిక వాహనంపై జరిపిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి. పది మంది జవాన్ల బృందం మాచేడీ- కిండ్లీ- మల్హార్ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో, ముష్కరులు ఒక్క ఉదుటున వాహనం పైకి గ్రనేడ్ విసిరారు. దీంతో ఐదుగురు సైనికిలు మృతిచెందారు.
ఫూంచ్, రాజౌరీ జిల్లాల్లో ప్రారంభమైన ఉగ్రదాడులు ఇప్పుడు క్రమంగా జమ్ము కశ్మీర్ అంతా విస్తరించాయి. కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు లేవు. జమ్ము ప్రాంతంలో 32 నెలల్లో జరిగిన ఉగ్రదాడుల్లో దాదాపు 40మందికి పైగా సైనికుల మరణించారు. సుమారు 60మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. గత నెలలో భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు పైచేయి సాధించొద్దని సూచించారు.