IT Raids On Agra Shoe Trader House : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన తనిఖీలు సంచలనంగా మారాయి. ఆ సోదాల్లో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారుల కంగుతిన్నారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏమూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. ఆ డబ్బు లెక్కపెట్టలేక యంత్రాలే ఆగిపోయాయి. ఆ డబ్బుల కట్టలతో పాటు ఆక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
వంద కోట్లు స్వాధీనం
ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. సుమారు 42 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో కూడా 500 రూపాయల నోట్ల కట్టలు కోట్లల్లో లభ్యమయ్యాయి. వాటిని లెక్క పెట్టలేక యంత్రాలే మొరాయించాయంటే ఎంత డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఏకకాలంలో 14 చోట్ల సోదాలు
ఆదాయపు పన్ను దర్యాప్తు బృందం శనివారం ఉదయం 11 గంటలకు ఆగ్రాలోని 14 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎమ్జీ రోడ్‌కు చెందిన బీకే షూస్, ధాక్రాన్‌కు చెందిన మన్షు ఫుట్‌వేర్, ఆసఫోటిడా మండికి చెందిన హర్మిలాప్ ట్రేడర్స్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఆగ్రా, లఖ్‌నవూ, కాన్పూర్, నోయిడాకు చెందిన అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు ఉన్నారు.
మంచం కింద నోట్ల 'గుట్టలు'
హర్మిలాప్ ట్రేడర్స్ యజమాని రామ్‌నాథ్ డంగ్‌కు చెందిన జయపురలోని ఇంట్లో మంచాలు, పరుపులు, అల్మారాలు, షూ బాక్స్‌లు, బ్యాగులు, గోడల్లో భారీ మొత్తంలో రూ.500ల నోట్ల కట్టలను ఐటీ బృందం గుర్తించింది. రెండు రోజుల క్రితం సోదాలు ప్రారంభమవ్వగా, ఇప్పటికీ ఈ నగదును లెక్కిస్తూనే ఉన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మంచంపై రూ. 500 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి.
గోవింద్ నగర్‌లోని రామ్నాథ్డాంగ్కు చెందిన మరో నివాసంలో కూడా భారీగా నగదు పట్టుబడింది. ప్రత్యేక బృందాలు, డబ్బుల లెక్కింపులో నిమగ్నమై ఉన్నాయి. వాషింగ్ మెషీన్, గోడల్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా డబ్బులు గుర్తించినట్లు తెలుస్తోంది. నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడం వల్ల ఇతర యంత్రాలను తెప్పించారు. రూ.100 కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని స్వాధీనం చేసే అవకాశం ఉందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు.
ఆస్తుల పత్రాలు కూడా
ఈ సోదాల్లో చెప్పుల వ్యాపారి రామ్‌నాథ్‌డాంగ్ ఇంటి నుంచి ఐటీ బృందం ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. కొంతకాలంగా బీకే షూస్, మన్షు ఫుట్‌వేర్‌లో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని ఆదాయపు పన్నుశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో ఐటీ శాఖ సోదాలు చేసింది. భూమి, బంగారంపై పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్మారాలు, షూ బాక్స్‌లు, మంచాల్లో కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి.