IT Notice To Congress : ఆదాయపు పన్ను అంశంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం మరోసారి కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలనను నిలిపేయాలన్న కాంగ్రెస్ పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు జరిగాయి. కాగా, మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఐటీశాఖ పునఃపరిశీలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇవే కారణాలతో దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 2014-15 నుంచి 2016-17 పునఃపరిశీలనకు సంబంధించి రూ.200 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు ఐటీ విభాగం స్పష్టం చేసింది. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను రికవరీ చేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు తాము తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. అందుకు న్యాయస్థానం తిరస్కరించిన వెంటనే ఐటీ విభాగం కొత్త నోటీసులను జారీ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
'ఇది ముమ్మాటికీ ట్యాక్స్ టెర్రరిజమే!'
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకే కేంద్రం ఆదాయపు పన్ను విభాగంతో దాడులు చేయిస్తోందని ఆ పార్టీ మండిపడింది. ఈ చర్యలను పన్ను ఉగ్రవాదంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అభివర్ణించారు. పన్ను ఉగ్రవాదాన్ని కాంగ్రెస్‌పై దాడి చేసేందుకు ఉపయోగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
బీజేపీ నుంచి రూ.4,600 కోట్లు వసూలు చేయాలి : కాంగ్రెస్
ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే తాజా నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా ఆరోపించారు. ఇది అహేతుక చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై దాడి కోసమే ఇలా చేస్తున్నారని ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం యత్నిస్తోందని దుయ్యబట్టారు. చట్టపరంగా దీన్ని సవాలు చేస్తామన్నారు. ఆదాయపు పన్ను చట్టం నిబంధనలు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఉల్లంఘించిందని ఆ పార్టీ నుంచి రూ.4,600 కోట్లు వసూలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
దేశ ప్రజాస్వామ్యం ఫ్రీజ్ అయింది : రాహుల్
Congress Allegations On BJP : తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప చేసి ప్రజాస్వామ్యానికి కేంద్రం తీవ్ర నష్టం కలిగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్ పార్టీపైనే కాక, ప్రజాస్వామ్యంపైనా ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.