IT Notice To Congress : లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కష్టాలు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. రెండ్రోజులక్రితం రూ.1,823 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపిన ఆదాయపన్ను శాఖ తాజాగా మరో రూ. 1,745కోట్లు కట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. 2014-15 నుంచి 2016-17 సంవత్సరాలకు సంబంధించి రూ.1,745 కోట్లు కట్టాలని ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన రెండు నోటీసుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ. 3,567 కోట్ల చెల్లించాల్సి ఉంటుంది. 2014-15 సంవత్సరానికి రూ. 663 కోట్లు, 2015-16కు రూ.664 కోట్లు, 2016-17కు రూ. 417 కోట్లు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ పార్టీలకు ఇచ్చే పన్ను మినహాయింపు ముగిసినందున ఆ పార్టీకి చెందిన మొత్తం ఆదాయంపై పన్ను విధించినట్లు తెలిపాయి.
మరుసటి రోజే నోటీసులు
2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం శుక్రవారం కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. 2017 - 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలనను నిలిపేయాలన్న కాంగ్రెస్ పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసిన మరోసటి రోజే ఈ నోటీసులు ఇచ్చారు. కాగా, మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టులో పిటిషన్!
అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఐటీశాఖ పునఃపరిశీలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇవే కారణాలతో దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 2014-15 నుంచి 2016-17 పునఃపరిశీలనకు సంబంధించి రూ.200 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు ఐటీ విభాగం స్పష్టం చేసింది. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను రికవరీ చేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు తాము తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. అందుకు న్యాయస్థానం తిరస్కరించిన వెంటనే ఐటీ విభాగం కొత్త నోటీసులను జారీ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును సోమవారం ఆశ్రయించవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పవార్ ఫ్యామిలీలో 'పవర్' పాలిటిక్స్- పోటీకి వదినా-మరదళ్లు 'సై' - Supriya Sule vs Sunetra Pawar