International Drugs Syndicate Busted : భారత్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్ట చేశారు పోలీసులు. దిల్లీ పోలీసులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో- ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు. ఈ నెట్‌వర్క్ అంతర్జాతీయంగా రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అధికారులు సీజ్ చేసిన 'సూడోపెడ్రిన్' (pseudoephedrine)కు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మెథాంఫేటమిన్ (Methamphetamine) తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఈ డ్రగ్‌ను కిలో రూ.1.5 కోట్ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ డ్రగ్ పంపుతున్నట్లు ఎన్‌సీబీకి సమాచారం వచ్చింది. ఈ డ్రగ్‌ను హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి పొడి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది.
50 కేజీల డ్రగ్ సీజ్
ఈ క్రమంలోనే సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి డ్రగ్స్ ముఠా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15న పశ్చిమ దిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీ చేపట్టారు. ఈ కేసుకు సబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ భారత్ సహా మలేసియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ డ్రగ్ సిండికేట్ ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోపెడ్రిన్‌తో ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేశారని పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడ్ని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని చెప్పారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని పోలీస్ అధికారులు వెల్లడించారు.
బైక్‌ను తప్పించబోయి కంటైనర్‌కు ఢీ కొట్టిన కారు- 9మంది దుర్మరణం
కశ్మీర్ టు పంజాబ్- డ్రైవర్ లేకుండా 78కి.మీ దూసుకెళ్లిన రైలు- టెన్షన్ టెన్షన్!