Indians In Russian Army : రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయులను భారత్ డిమాండ్ మేరకు మాస్కో సేవల నుంచి తప్పించినట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా బలగాలలోని భారతీయులను సైనిక సేవల నుంచి తప్పించేందుకు మాస్కోతో చర్చలు కొనసాగించిడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది.
రష్యా సైన్యంలో చాలా మంది సహాయక సిబ్బందిగా భారతీయులు సేవలందిస్తున్నారు. అయితే వారిని బలవంతంగా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పోరాడేందుకు అక్కడి సైనికాధికారులు ఆదేశిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగు చూశాయి. ఆ కథనాలు స్పష్టంగా లేవని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి కేసును రష్యా అధికారులతో చర్చిస్తున్నామనీ, దిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపింది. ఇప్పటికే చాలామంది భారతీయులను రష్యా సైన్యం నుంచి తప్పించారని, వీలైనంత తొందరగా మిగిలిన కేసులను పరిష్కరిస్తామని వివరించింది.
అంతకుముందు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఓ భారతీయుడు మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురించింది. రష్యా ఆక్రమిత దొనెట్స్క్ ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై, ఈ యుద్ధంలో చిక్కుకుపోయిన మరో భారతీయుడు స్పందించాడు. అతడు తుపాకీ కాల్చడాన్ని సాధన చేస్తుండగా 150 మీటర్ల దూరం నుంచి తాను చూశానని చెప్పాడు. ఆ సమయంలోనే ఈ దాడి జరిగిందని తెలిపాడు. ఇక తమను రష్యా నుంచి ఎలాగైనా బయటపడేయాలని అతడు అభ్యర్థించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపైనే తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది.
'భారతీయులు యుద్ధానికి దూరంగా ఉండండి'
మరోవైపు, కొందరు భారతీయులు, అక్కడి సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీన్ని విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ విషయంపై తాము రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. బాధితులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారతీయులు ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి దూరంగా ఉండాలని సూచించింది.
గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం- కలుపు మొక్కలు తింటూ పౌరుల జీవనం!
గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్- శరణార్థి శిబిరాలే టార్గెట్- 100మంది మృతి