Indian Army LOC News : గణతంత్ర దినోత్సవానికి భారతావని సిద్ధమవుతున్న వేళ ఉగ్రమూకలు విధ్వంసం సృష్టించే అవకాశం ఉండడం వల్ల భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దుల నుంచి దేశంలోకి ఎవరూ చొరబడకుండా పహారా కాస్తోంది. రిపబ్లిక్ డే వేడుకల వేళ ముష్కరుల నుంచి ముప్పు పొంచి ఉండడం వల్ల సరిహద్దులపై నిరంతర నిఘాను కొనసాగిస్తోంది. అత్యాధునిక ఆయుధాలతో షిఫ్టుల వారీగా సైనికులు పహారా కాస్తున్నారు. నైట్ విజన్ ఆయుధాలతో కంటి మీద రెప్ప కూడా వేయకుండా 24 గంటలపాటూ పహారా కాస్తున్నట్లు విధుల్లో ఉన్న సైనికులు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని గురేజ్, బందిపొరాలో సుశిక్షితులైన స్నైపర్‌లను మోహరించారు. కృత్రిమ మేధను ఉపయోగించి అధునాతన సాంకేతికతతో తయారు చేసిన ఆయుధాలతో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. నైట్ విజన్ పరికరాలతో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని సైనికులు వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవని వీటి ద్వారా ఎంత చీకటి సమయంలోనైనా శత్రువుల రాకపై దృష్టి పెట్టవచ్చని తెలిపారు. దేశంలోకి సరిహద్దుల గుండా ఎవరూ ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో ముఖానికి రంగులు పోసుకుని గాడాంధకారంలో సైనికులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు.
దిల్లీలోనూ పటిష్ఠ భద్రత
మరోవైపు గణతంత్ర వేడుకలకు దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దిల్లీలోని కర్తవ్యపథ్ చుట్టూ 14 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు 77వేలమంది ఆహ్వానితులు వస్తారని అంచనా వేస్తున్నారు. భద్రతా, ట్రాఫిక్, జిల్లా యూనిట్లతో కలిసి హస్తినలో భద్రతను సమన్వయం చేస్తామని దిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. 14 వేల మందిని కర్తవ్యపథ్ వద్ద మోహరిస్తామని వివరించారు. కమాండోలు, సత్వర స్పందన దళాలు, PCR వ్యాన్లు, స్వాట్ బృందాలు నిర్దేశిత ప్రాంతాల్లో ఉంటాయని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా దిల్లీ పోలీసులు సిద్ధమైనట్లు ప్రత్యేక కమిషనర్ పాఠక్ వెల్లడించారు. సీసీ కెమెరాలతో పాటు ప్రతిమూలనా పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. గగనతలం నుంచి తలెత్తే ముప్పును సైతం ఎదుర్కొనేలా సిద్ధమైనట్లు తెలిపారు.
న్యూదిల్లీ జిల్లాను 28 జోన్లుగా విభజించి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి జోన్‌ను డీసీపీ లేదా అదనపు డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. గణతంత్ర వేడుకలకోసం జనవరి 25 రాత్రి 10 గంటల నుంచి జనవరి 26 ఉదయం వరకూ వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని, దారిమళ్లిస్తామని దిల్లీ ట్రాఫిక్ ప్రత్యేక కమిషనర్ HGS ధాలివల్ చెప్పారు. వేడుకలకు వచ్చే సందర్శకులు వీలైనంత వరకు ప్రజా రవాణానే ఎంచుకోవాలని సూచించారు.