India Commissions INS Arighat : భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ (INS Arighaat)ను భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ అణు జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మన శక్తిసామర్థ్యాలకు, శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిదర్శనమన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఐఎన్‌ఎస్ అరిఘాత్ భారత నౌకాదళంలో చేరిన రెండో అణు జలాంతర్గామి కావడం విశేషం. ఇప్పటికే 'ఐఎన్‌ఎస్ అరిహంత్' తన సేవలు కొనసాగిస్తోంది.
ఐఎన్‌ఎస్ అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో 2011 డిసెంబరులో చేపట్టారు. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబరు 19న జలప్రవేశం చేయించారు. అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు. సీ ట్రయల్స్ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు.
ఐఎన్ఎస్ అరిఘాత్ విశేషాలివే!
ఈ ఐఎన్ఎస్ అణు జలాంతర్గామి పొడవు 111.6 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు. డ్రాఫ్ట్ (లోతు) 9.5 మీటర్లు. ఈ సబ్మెరీన్ సముద్ర ఉపరితలంలో గంటకు 12-15 నాటికల్ మైళ్లు (22 కి.మీ నుంచి 28 కి.మీ) వేగంతో పయనిస్తుంది. అదే సముద్ర జలాల్లో అయితే 24 నాటికల్ మైళ్ల వేగంతో వెళుతుంది.
ఐఎన్ఎస్ అరిఘాత్ ప్రత్యేకతలు : ఈ అణు జలాంతర్గామిలో సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, సాగరిక క్షిపణులు సహా, రేడియేషన్ బయటకు రాకుండా భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
నేవీ అమ్ములపొదిలిలోకి
'ఐఎన్‌ఎస్ అరిహంత్' స్ఫూర్తితో 'ఐఎన్‌ఎస్ అరిఘాత్'ను భారత నౌకాదళం నిర్మించింది. శత్రుదేశాల్లోని సైనిక స్థావరాలు, అణువిద్యుత్ కేంద్రాలు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేసే స్ట్రాటజిక్ క్షిపణులను నీటి అడుగు నుంచి ప్రయోగించే సామర్థ్యంతో ఈ అణు జలాంతర్గామిని రూపొందించింది.
వాస్తవానికిి ఇండియన్ నేవీలోని తొలి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ చక్రను రష్యా నుంచి లీజుకు తీసుకోవడం జరిగింది. 2018 నుంచి ఐఎన్‌ఎస్ అరిహంత్ ఇండియన్ నేవీకి పూర్తిస్థాయి సేవలు అందిస్తోంది. ఇప్పుడు దానికి మించిన శక్తి కలిగిన ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను ఇండియన్ నేవీ రూపొందించింది.
ఐఎన్ఎస్ అరిహంత్‌లో 750 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే కె-15 క్షిపణులు ఉంటాయి. అరిఘాత్‌లో దానికి నాలుగు రెట్లు అంటే 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల నాలుగు కే-4 సబ్‌మెరైన్ లాంఛ్డ్ బాలిస్టిక్ క్షిపణులు లేదా స్ట్రాటజిక్ అణువార్‌హెడ్లను మోసుకెళ్లగల 12 కే-15 ఎస్‌ఎల్‌బీఎంలను అమర్చవచ్చు. ఈ జలాంతర్గామి నుంచి క్షిపణిని బంగాళాఖాతం ఉత్తర భాగం నుంచి ప్రయోగిస్తే చైనా రాజధాని బీజింగ్ కూడా దీని పరిధిలోకి వస్తుంది. ఈ సిరీస్‌లోని మూడో అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అర్ధిమాన్' వచ్చే ఏడాది నేవీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.