INDIA Bloc PM Post : లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ వస్తుందని, 48 గంటలకంటే తక్కువ సమయంలోనే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. ఇండియా కూటమిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రధాని పదవికి సహజ హక్కుదారుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరాం రమేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఇండియా కూటమి మెజారిటీకి అవసరమైన 272 సీట్లు కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుంది. కూటమికి మెజార్టీ వచ్చిన తర్వాత, కొన్ని ఎన్ డీఏ పార్టీలు సంకీర్ణం ప్రభుత్వంలో చేరవచ్చు. ఆ పార్టీలను కూటమిలో చేర్చుకోవాలా? వద్దా? అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎన్ డీఏ, ఇండియా కూటమి పార్టీల మధ్య రెండు తేడాలు ఉన్నాయి. ఇమాందారీ (నిజాయితీ), ఇన్సానియత్ (మానవత్వం). ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతీకార రాజకీయాలు ఉండవు. ప్రధాని మోదీ ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్‌కు వెళ్లి రెండు రోజులపాటు ధ్యానం చేస్తున్నారు. అదే వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. రాహుల్ ఎక్కడ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారో, పదవీ విరమణ తర్వాత జీవితం ఎలా ఉండబోతుందనే దానిపై ప్రధాని మోదీ ధ్యానం అక్కడే చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
2004 ఫలితాలు రిపీట్!
2004 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ 'ఇండియా షైనింగ్' పేరిట ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, అలాంటి ఫలితమే 2024లోనూ పునరావృతం అవుతుందని జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, అసోంలో హస్తం పార్టీకి సీట్లు పెరుగుతాయని అంచనా వేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ 62, బంగాల్లో 18, బిహార్ లో ఎన్డీఏ 39 సీట్లు గెలిచిందని, వాటిని ఈసారి కాపాడుకోలేదని చెప్పారు.
"జూన్ 1న ఇండియా కూటమి సమావేశం జరగబోతోందని నాకు ఎటువంటి ప్రామాణిక సమాచారం లేదు. 2004 మే 13న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మే 16న యూపీఏ సమావేశమైంది. మే 17న ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేశాం. అప్పట్లో ప్రధాని పేరు బయటకు రావడానికి 3 రోజుల కంటే తక్కువ సమయం పట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయడానికి 48 గంటలు కూడా పట్టదు. కూటమిలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా కాంగ్రెస్ అవతరించే అవకాశం ఉంది. అత్యధిక స్థానాలు ఉన్న పార్టీ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తుంది. స్థిరమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రధాని వస్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక మోదానీ, మోదాంజలి స్కామ్ లపై విచారణ జరిపేందుకు నెలలోగా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తాం" అని జైరాం రమేశ్ తెలిపారు.
ఇండియా కూటమికి మెజార్టీ పక్కా!
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దేశాన్ని కలుపుకుని పోయే జాతీయవాద ప్రభుత్వాన్ని ఇండియా కూటమి ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బీజేపీ మరో అధికారంలోకి వస్తే దేశంలోని ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుందని విమర్శించారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్డీఏ సర్కార్ పై ఖర్గే విమర్శలు గుప్పించారు.
"కులం, మతంపై ఓట్లను అభ్యర్థించకూడదని ఈసీ ఆదేశించినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 'మందిర్-మసీదు' గురించి 421 సార్లు మాట్లాడారు. గత 15 రోజుల్లో మోదీ తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పేరును 232 సార్లు, నా పేరును 758 సార్లు ఉపయోగించారు. దేశంలో నిరుద్యోగం గురించి మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇండియా కూటమి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దేశానికి సమ్మిళిత, జాతీయవాద ప్రభుత్వాన్ని అందిస్తుంది" అని ఖర్గే వ్యాఖ్యానించారు.