INDIA Alliance on Kejriwal Arrest : లిక్కర్ స్కాం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో విపక్ష కూటమి 'ఇండియా' కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష నేతలపై అధికార బీజేపీ అణచివేత వైఖరికి నిరసనగా మార్చి 31న దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్‌లో 'మహా ర్యాలీ' నిర్వహిస్తున్నట్లు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ ప్రకటించారు. ఆదివారం దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు.
దేశాన్ని కాపాడటం కోసం అన్ని ఆధ్యాత్మిక, వ్యాపార, రాజకీయ సంఘాలు 'మహా ర్యాలీ' బహిరంగ సభలో పాల్గొనాలని గోపాల్ రాయ్ కోరారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నియంతృత్వానికి వ్యతిరేకంగా మార్చి 31న (ఆదివారం) ఉదయం 10 గంటలకు రాంలీలా మైదాన్ వేదికగా యావత్ దిల్లీ ఏకం కావాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలని భావించే వారు.. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు తప్పకుండా ఈ సభకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ''సీఎం కేజ్రీవాల్ అరెస్టును అందరూ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతి వ్యక్తిలోనూ కోపం ఉంది. ప్రతిపక్ష నేతలపై నకిలీ కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారు'' అని గోపాల్ రాయ్ ఆరోపించారు.
మహా ర్యాలీ రాజకీయ సభ కాదు
''మార్చి 31న జరిగే మహా ర్యాలీ రాజకీయ సభ కాదు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పిలుపు అది. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా గొంతు వినిపించే వేదిక అది'' అని దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ అన్నారు. ''మనదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడేందుకు మా నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఇండియా కూటమిలోని పార్టీలకు అండగా మేం ఉంటాం'' అని ఆయన స్పష్టం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించేందుకు కూడా బీజేపీ సర్కారు తెగబడిందని అర్విందర్ ఆరోపించారు.
మరోవైపు, కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం దిల్లీలో కొవ్వొత్తులతో మార్చ్, దిష్టిబొమ్మ దహనాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.