India Alliance Meeting at Delhi : సార్వత్రిక ఎన్నికల సమరంలో గతంలో కంటే ఈసారి ఎక్కువ స్థానాలు వస్తాయని ఆశిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఓట్ల లెక్కింపు సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు దిల్లీలో సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ , సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆప్ , ఆర్జేడీ, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-శరద్ పవార్ వర్గానికి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. ఆప్ తరఫున దిల్లీ సీఎం కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , సంజయ్ సింగ్ , రాఘవ్ చద్దా భేటీలో పాల్గొన్నారు. శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, అనిల్ దేశాయ్, సీతారాం ఏచూరి, చంపయి సోరెన్, కల్పనా సోరెన్, టిఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా, డి రాజా, ముఖేశ్ ఈ కీలక భేటీకి హాజరై చర్చలు జరిపారు. భేటీ ముగిసిన తర్వాత ఇండియా కూటమి నేతలు విజయసంకేతం చూపారు.
'ఎగ్జిట్‌పోల్స్‌పై చర్చల్లో పాల్గొంటాం'
ఎగ్జిట్‌పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనకూడదన్న తమ నిర్ణయం మార్చుకున్నట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు. 'ప్రజల్లో సందేహాలు ఉండకూడదని, కొందరు అసత్యాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నందున ప్రజలకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాం. ఇండియా కూటమికి తక్కువలో తక్కువ 295 ప్లస్ స్థానాలు వస్తాయి. అంతకంటే ఎక్కువే తప్ప తక్కువ మాత్రం రావు. లెక్కలు వేసుకొని ఈ నిర్ణయానికి వచ్చాం. మా నేతలను సంప్రదించిన తర్వాతనే ఈ లెక్కలు వచ్చాయి' అని ఖర్గే పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొంటారని ఆ పార్టీ మీడియా విభాగం ఛైర్‌పర్సన్ పవన్ ఖేడా ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో జరిగే చర్చల్లో పాల్గొనలా వద్దా అనే అంశంపై చర్చకు వచ్చిందని, ఈ చర్చల్లో పాల్గొని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయాలని నిర్ణయించామని ఖేడా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌లో పాల్గొనడానికి అనుకూల, వ్యతిరేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
మమతా, ముఫ్తీ దూరం
టీఎంసీ, పీడీపీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. బంగాల్లో ఎన్నికలు ఉన్నందున తాము సమావేశానికి హాజరు కాలేమనీ టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా సమావేశానికి హాజరు కాలేనని చెప్పారు. మా అమ్మ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నందున తాను సమావేశానికి హాజరుకాలేకపోయానని మెహబూబా ముఫ్తీ తెలిపారు.