Independent Candidates winning percentage : సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందడం వల్ల స్వతంత్ర అభ్యర్థులు విఫలమవుతున్నట్లు ఎన్నికల సంఘం డేటా చెబుతోంది. 1991 నుంచి 99 శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నా విజయం సాధించేవారు మాత్రం తగ్గుతూ వస్తున్నారు.
1951 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు 6.90 శాతంగా ఉండగా 1957లో అది 8 శాతానికి పెరిగింది. 2019లో మాత్రం 0.11 శాతానికి పడిపోయింది. 1951 సార్వత్రిక ఎన్నికల్లో 533మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 37మంది గెలుపొందారు. 1957 సార్వత్రిక ఎన్నికల్లో 1,519మంది ఇండిపెండెంట్లు పోటీ చేయగా వారిలో 42 మంది గెలిచారు. ఆ రెండు ఎన్నికల్లో కూడా 67 శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.
గత కొన్ని దశాబ్దాలుగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 1962లో కేవలం 20 మంది స్వతంత్ర అభ్యర్థులే గెలుపొందగా 78 శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో 13మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. 96 శాతం డిపాజిట్లు కోల్పోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 8 వేల మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా కేవలం నలుగురే నెగ్గారు. 99.6 శాతం మందికి డిపాజిట్లు దక్కలేదు. కర్ణాటకలోని మండ్య నుంచి బీజేపీ మద్దతుతో నటి సుమలత, మహారాష్ట్రలోని అమరావతి నుంచి కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతుతో నవనీత్ రాణా గెలుపొందారు. అసోంలోని కోక్రాఝర్ నుంచి ఉల్ఫా మాజీ కమాండర్ నబా కుమార్ సరానియా, దాద్రా నగర్ హవేలి నుంచి మోహన్ భాయ్ సంజీభాయ్ దేల్కర్ స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు.
గత 20 ఏళ్లుగా స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లకు అప్రస్తుతంగా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండిపెండెంట్లకు ఓట్లు వేసి ప్రయోజనం ఏమిటని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీలు మద్దతు ఇచ్చే కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు తప్పిస్తే మిగిలిన వారు ఓటర్ల జీవితాల్లో పెద్దగా మార్పులు తెచ్చే అవకాశం లేదని అంటున్నారు.
డిపాజిట్ కోల్పోవడం అంటే ఇదే!
పోలై చెల్లే ఓట్లలో ఆరింట ఒకవంతు ఓట్లు దక్కించుకుంటే ఆ అభ్యర్థికి డిపాజిట్ దక్కుతుంది. 1951 సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ మొత్తం 500 ఉండగా ప్రస్తుతం అది 25 వేల రూపాయలకు చేరింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 12,500 రూపాయల డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. ఆరింట ఒక వంతు ఓట్లు సాధిస్తేనే ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. లేదంటే అది ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.
'ఇండియా'లో ఎవరి దారి వారిదే- కశ్మీర్లో PDP, NC విడివిడిగా పోటీ - jammu kashmir lok sabha election