How to make Tandoori Chicken Wraps: వీకెండ్ వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో నాన్‌వెజ్ ఉండాల్సిందే. ఎక్కువ మంది చికెన్(Chicken)తో కర్రీ, వేపుడు, పులుసు లాంటివి చేస్తుంటారు. కానీ.. ప్రతిసారీ ఒకే పద్ధతిలో తిని బోర్ కొట్టిందనిపిస్తే.. ఈ వీకెండ్లో కొత్తగా తందూరి చికెన్ రోల్స్ రెసిపీ ట్రై చేసి చూడండి. యమ్మీ యమ్మీ అనకపోతే చూడండి! నిజానికి తందూరి రెసిపీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ.. ఎలా తయారు చేయాలో తెలియక బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటుంటారు. ఇక, నుంచి అలాంటి అవసరం లేదు. ఇంట్లోనే ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
తందూరి చికెన్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
- 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్,
- ఉప్పు - తగినంత,
- నూనె - అవసరం మేరకు,
- టోర్టిల్లాలు - 6, (మొక్క జొన్న పిండితో చేసే చపాతీల్లాంటివి. మార్కెట్లో లభిస్తాయి.)
- కొన్ని నల్ల మిరియాలు
చికెన్ మారినేషన్ కోసం అవసరమైన పదార్థాలు..
- 4 టేబుల్ స్పూన్ల పెరుగు
- 2 టీస్పూన్ల వెల్లుల్లి పేస్ట్
- 1 టీస్పూన్ ధనియాల పొడి
- 1 టీస్పూన్ కారం పొడి
- 2 టీస్పూన్ల అల్లం పేస్ట్
- 3 టీస్పూన్ల గరం మసాలా పొడి
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
గమనిక : ఇవి ఆరుగురు వ్యక్తులకు చికెన్ రోల్స్ తయారుచేయడానికి సూచించినవి. అంతకంటే ఎక్కువమంది ఉంటే వీటిని పెంచుకోవాల్సి ఉంటుంది.
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!
Tandoori Chicken Wraps Making Process:
తందూరి చికెన్ రోల్స్ తయారీ విధానం :
- ముందుగా మీరు చికెన్ మేరినేషన్ కోసం మసాలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
- ఇందుకోసం ఒక గిన్నెలో పైన చెప్పిన పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం , ధనియాల పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం అన్నింటినీ తీసుకొని బాగా కలుపుకోవాలి.
- అదేవిధంగా.. రుచికి సరిపడా ఉప్పు, కొన్ని మిరియాలు వేసి అన్ని పదార్థాలనూ బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు చికెన్ ముక్కలను శుభ్రం చేసుకొని, వాటిని మసాలా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమం చికెన్ ముక్కలకు పట్టేలా చూసుకోవాలి. ఇలా మారినేషన్ చేసుకున్న చికెన్‌ను కాసేపు పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో తగినంత నూనె పోసుకోవాలి. దానిని మీడియం మంట మీద వేడి చేయాలి.
- కాస్త హీట్ అయ్యాక ఆ గిన్నెలో మారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బ్రౌన్, క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు టోర్టిల్లాలను తీసుకుని అవి రెండు వైపులా గోధుమ రంగులోకి వచ్చే వరకు పాన్ మీద వేడి చేయాలి.
- అనంతరం వేడి వేడి టోర్టిల్లాలను వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలతో నింపి వాటిని గట్టిగా చుట్టాలి.
- అంతే ఎంతో టేస్టీగా తందూరి చికెన్ రోల్స్ రెడీ. వీటిని మీకు ఇష్టమైన చట్నీ, మిక్స్డ్ సలాడ్‌తో ఇంటిల్లిపాది హాయిగా తినేయొచ్చు.
చికెన్ రెగ్యులర్‌గా వండేస్తున్నారా? - ఈ సండే ఇలా చేయండి - కమ్మగా, కారంగా!
How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!