Chinta Chiguru Recipes: సండే వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగ అన్నట్లే. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. అంటూ నచ్చినవి వండుకుని తింటుంటారు. అయితే చాలా మందికి ఎప్పుడూ ఒకే రకం తిని బోర్ కొడుతుంది. కానీ, వెరైటీలు చేయడం రాక వచ్చిన వాటితోనే అడ్జస్ట్ అవుతారు. అయితే ఇప్పుడా అవసరం లేదు. ఎప్పుడూ వండే చికెన్, మటన్‌కు కాస్తా చింతచిగురు యాడ్ చేస్తే రుచి అద్దిరిపోతుంది. మరి మాకు రాదు అంటారా? నో టెన్షన్ మీ కోసం చింతచిగురు చికెన్ ఫ్రై, చింతచిగురు మటన్ తీసుకొచ్చాం. వీటిని చేయడం కూడా చాలా సులువు. నోటికి కారం కారంగా, పుల్లపుల్లగా ఉండే ఈ కూరలు ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
చింతచిగురు మటన్:
కావలసినవి..
- చింత చిగురు- కప్పు
- మటన్- అర కేజీ
- ఉల్లిపాయలు- నాలుగు,
- పచ్చిమిర్చి- ఐదు,
- ఉప్పు, కారం -రుచికి తగినంత,
- అల్లం వెల్లుల్లి పేస్ట్- పెద్ద చెంచా,
- పసుపు- చిటికెడు,
- ధనియాల పొడి - రెండు చెంచాలు
- గరం మసాలా- రెండు చెంచాలు,
- నూనె- కొద్దిగా
- జీలకర్ర- చెంచా
- బిర్యానీ ఆకులు- మూడు.
తయారీ విధానం:
- మటన్‌ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింత చిగురును శుభ్రం చేసుకుని చేతులతో నలిపి పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు, ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా కోసి పెట్టుకోవాలి.
- స్టౌ ఆన్ చేసి కుక్కర్ పెట్టి.. నూనె పోసుకోవాలి.
- నూనె కాగాక... జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి రంగు మారే వరకూ మగ్గనివ్వాలి.
- ఆపై అల్లం వెల్లుల్లి పేస్టుని చేర్చి పచ్చి వాసన పోయే వరకూ ఉంచి, తర్వాత మటన్ వేసి మూత పెట్టాలి.
- ఇది మగ్గాక ఉప్పు, కారం, పసుపుతో పాటు రెండు నిమిషాలాగి ధనియాలపొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు కూడా చల్లి మూత పెట్టాలి.
- ఇందులో నీళ్లు పోయి నూనె పైకి తేలే వరకూ మంట మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అడుగంటకుండా తిప్పాలి.
- అప్పుడు కొన్ని నీళ్లు పోసి మూతకు విజిల్ పెట్టి ఆరు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.
- చల్లారాక ముక్క ఉడికిందో లేదో చూసి చింత చిగురు కలిపి మరో ఆరేడు నిమిషాలు సిమ్‌లో ఉంచి ఉడకనివ్వాలి.
- ఈ కూరను వేడి వేడి అన్నంలోకి తింటే భలే రుచిగా ఉంటుంది.
చింతచిగురు చికెన్ ఫ్రై:
కావాల్సిన పదార్థాలు:
- బోన్‌లెస్ చికెన్- అరకేజీ
- చింతచిగురు- 11/4 కప్పు
- కొబ్బరి తురుము- రెండు చెంచాలు
- అల్లంవెల్లుల్లి పేస్ట్- చెంచా
- ఉల్లిపాయలు- రెండు
- పచ్చిమిర్చి- మూడు
- పసుపు- పావుచెంచా
- ఉప్పు, కారం- రుచికి సరిపడా
- ధనియాలపొడి- చెంచా
- గరంమసాలా- అరచెంచా
- నూనె- అరకప్పు
- దాల్చినచెక్క- రెండు ముక్కలు
- లవంగాలు- మూడు
తయారీ విధానం:
- ముందుగా చింత చిగురును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోయాలి.
- నూనె వేడెక్కాక దాల్చినచెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయాలి.
- అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.
- తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరి తురుము, గరంమసాలా వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
- చికెన్ పూర్తిగా ఉడికాక చింతచిగురు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు స్టౌని సిమ్‌లో పెట్టి.. మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి కూర పొడిపొడిగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. అంతే ఎంతో టేస్టీ చింతచిగురు చికెన్ ఫ్రై రెడీ..
సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే! - Ginger Pepper Chicken Recipe