How To Prepare Instant Vada in Telugu: వడ.. చాలా మంది తినే బ్రేక్‌ఫాస్ట్. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో మనందరకీ తెలిసిందే. కానీ, వడలను అప్పటికప్పుడు రెడీ చేయడం అస్సలు వీలుకాదు. ముందుగా పప్పును నానబెట్టాలి.. ఆ తర్వాత రుబ్బాలి. ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదేమి లేకుండా కేవలం ఈ పొడి మీ ఇంట్లో ఉంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడే వడలు చేసుకోవచ్చు. ఏంటి నమ్మడం లేదా? మీరు విన్నది నిజమే. ఈ పొడితో వడలు నిమిషాల్లో రెడీ అవుతాయి. అంతేకాదు.. ఇవి పప్పు నానబెట్టి చేసినట్లుగానే చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫ్పీగా వస్తాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. బయట నుంచి క్రిస్పీగా.. లోపల సాఫ్ట్‌గా భలే టేస్టీగా వస్తాయి. తొందరగానే ప్రిపేర్ అవుతాయి కాబట్టి.. బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి అనే టెన్షన్ అక్కర్లేదు. మరి ఈ పొడి ఎలా రెడీ చేసుకోవాలి? ఈ పొడితో వడలు ఎలా వేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..
ఇన్స్టాంట్ వడలు తయారు చేయడానికి పొడి ప్రిపేర్ చేసే విధానం:
కావాల్సిన పదార్థాలు
- మినపప్పు - కొద్దిగా
పొడి తయారీ విధానం:
- ముందుగా మినపప్పు తీసుకోవాలి. ఎంతైనా తీసుకోవచ్చు. మీరు ముందుగా ట్రై చేయాలనుకుంటే కొద్దిమొత్తంలో తీసుకోవడం మంచిది.
- ఇప్పుడు ఆ మినపప్పును శుభ్రంగా కడిగి ఓ కాటన్ క్లాత్ మీద పరిచి మూడు గంటలు ఆరబెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆరిన మినపప్పు వేసి ఓ 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోని పక్కకు పెట్టుకోవాలి.
- మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది.
ఇన్స్టంట్ పొడితో వడలు:
కావాల్సిన పదార్థాలు:
- మినపప్పు పొడి - తగినంత
- పచ్చిమిర్చి - 4
- ఉల్లిపాయలు - 1
- కరివేపాకు - ఒక రెబ్బ
- ఉప్పు - సరిపడా
- వంట సోడా - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- జీలకర్ర - 1 టీ స్పూన్
- నూనె - వేయించడానికి సరిపడా
వడలు ప్రిపేర్ చేసుకునే విధానం:
- ముందుగా కావాల్సిన పరిమాణంలో మినపప్పు పొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా వడలు వేసుకునేందుకు సరిపడే విధంగా పిండి కలుపుకోవాలి.
- అలా కలుపుకున్న తర్వాత ఓ అరగంట సేపు పక్కకు పెట్టాలి.
- ఆ తర్వాత మళ్లీ ఒకసారి కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
- ఆ తర్వాత ఈ పిండిలో సోడా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోయాలి.
- నూనె బాగా వేడెక్కిన తర్వాత.. చేతిని కాస్త తడి చేసుకుంటూ పిండిని చేతిలోకి తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయండి.
- మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ వడలు రెడీ! నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.