How to Make chicken donuts at Home in Telugu : పిల్లలు ఎదగాలంటే ప్రొటీన్ చాలా అవసరం. కానీ.. కొందరు పిల్లలు నాన్ వెజ్ తినడానికి అంతగా ఇష్టం చూపించరు. ఏదో కొద్దిగా తినేసి.. మిగిలిందంతా పక్కన పెడుతుంటారు. ఇలాంటి వారు ఇంకా కావాలి అనేలా చికెన్ తినాలంటే.. జస్ట్ మేకింగ్ ప్రాసెస్ మార్చేస్తే సరిపోతుంది. యమ్మీ యమ్మీ అంటూ లాగిస్తారు. ఇందుకోసం మీరు చికెన్ డోనట్స్ తయారు చేస్తే సరిపోతుంది! మరి.. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
చికెన్ కీమా - పావు కేజీ
తరిగిన వెల్లుల్లి - 1 చెంచా
బంగాళ దుంప - ఒకటి
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
తరిగిన కొత్తిమీర - పావు కప్పు
క్యారెట్లు - రెండు
చిల్లీ ఫ్లేక్స్ - పావు చెంచా
జీలకర్ర పొడి - పావు చెంచా
బ్లాక్ పెప్పర్ పౌడర్ - పావు చెంచా
కారం - అర స్పూన్
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
బ్రెడ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
గుడ్డు - ఒకటి
నూనె - సరిపడా
తయారీ విధానం : మొదటగా బంగాళ దుంపలను ఉడికించాలి. క్యారెట్లను తురుముకోవాలి. ఆ తర్వాత చికెన్ కీమాను మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులోనే.. బ్రెడ్ పొడి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, చిల్లీ ఫ్లేక్స్, కారం, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసేయాలి. ఇప్పుడు వీటిని మెత్తని పేస్టులాగ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి కాస్త నూనె రాయాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన చికెన్ పేస్ట్‌ను వడలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దాదాపు 3 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. సమయం ముగిసిన తర్వాత ఒక గిన్నెలో గిలకొట్టిన గుడ్డు, మరో గిన్నెలో మైదాపిండి వేసుకొని రెడీగా ఉంచాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి కడాయి స్టౌపైన పెట్టి నూనె వేడి చేయాలి. తర్వాత ఫ్రిజ్‌లో నుంచి వడల షేప్‌లో తయారు చేసి పెట్టుకున్న చికెన్ డోనట్స్‌ను బయటకు తీయాలి. ఇప్పుడు.. ఒకదాన్ని ముందు గుడ్డు సొనలో ముంచి ఆ తర్వాత మైదాపిండిలో డిప్ చేసి.. ఆపైన నూనెలో వేయాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని బంగారు రంగులోకి మారాక తీయాలి. అంతే.. అద్భుతమైన 'చికెన్ డోనట్స్' రెడీ అయిపోతాయి.
సూపర్ స్నాక్స్‌గా...
వీటిని ఇంట్లో ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. పిల్లలు మాత్రమే కాదు.. పెద్దల కూడా వీటిని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ముఖ్యంగా ఇళ్లలో ఆడవాళ్లు చేసుకునే కిట్టీ పార్టీలతోపాటు ఎలాంటి ఫంక్షన్‌కు అయినా ఇవి ది బెస్ట్ పార్టీ స్టార్టర్స్ గా నిలుస్తాయి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా వీటిని వడ్డిస్తే.. చాలా వెరైటీగా, టేస్టీగా ఫీలవుతారు. సో.. చూశారు కదా.. ఈ సండే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి!