How To Identify Plastic Rice : 'కల్తీకి కాదేదీ అనర్హం' అన్నట్లుగా ప్రస్తుత కాలంలో మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. తాగే మంచినీళ్ల దగ్గరి నుంచి.. కారం, నెయ్యి, వంటనూనెలు, పొడులు, మసాలా దినుసులు ఇలా మార్కెట్లో దొరికే చాలావరకు పదార్థాలు కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇటీవల కాలంలో బియ్యం కూడా కల్తీ అవుతున్నాయి. కొందరు అడ్డదారుల్లో డబ్బు ఎక్కువగా సంపాదించడానికి ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నారు! అయితే, ఈ బియ్యం తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు. అందుకే బియ్యం కొనుగోలు చేసేటప్పుడు బాగా పరిశీలించాలని పేర్కొన్నారు. అయితే, ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా గుర్తించాలి అనేది చాలా మందికి తెలియదు! ఇప్పుడు చూద్దాం.
ప్లాస్టిక్ బియ్యాన్ని ఇలా గుర్తించండి!
నీళ్లలో తేలుతాయి :
ప్లాస్టిక్ బియ్యాన్ని ఈ టెక్నిక్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. అది ఎలా అంటే మనం బియ్యాన్ని నానబెట్టినప్పుడు అవి నాణ్యమైన బియ్యం అయితే నీటిలో మునిగిపోతాయి. అదే ప్లాస్టిక్ బియ్యం అయితే, నీటిలో తేలుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ఎప్పుడూ కూడా నీటిలో మునిగిపోదు, అందుకే ఈ టెక్నిక్‌ను ఫాలో అయిపోండి.
నమలండి :
మార్కెట్లో మీరు బియ్యం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని బియ్యం గింజలను తీసుకుని నమలండి. అవి నాణ్యమైనవే అయితే, సులభంగా నమలవచ్చు. అదే ప్లాస్టిక్ బియ్యం అయితే చాలా గట్టిగా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాను పాటించండి.
బియ్యాన్ని కాల్చాలి :
మీరు కొన్న బియ్యం.. ప్లాస్టిక్ బియ్యమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే.. కొన్ని బియ్యం గింజలను తీసుకుని కాల్చండి. కాలినప్పుడు వాసన వస్తే అవి ప్లాస్టిక్ బియ్యమని గుర్తించండి.
వేడి నూనెలో :
వేడిగా ఉండే నూనెలో బియ్యం వేయడం వల్ల కూడా ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించవచ్చు. అది ఎలా అంటే ప్లాస్టిక్ బియ్యం నూనెలో కరిగి పాత్రకు అంటుకుంటాయి. ఇలా బియ్యం పాత్రకు అంటుకుంటే అవి ప్లాస్టిక్ బియ్యమని గుర్తించండి.
ముద్దలుగా మారుతుంది :
అన్నం వండేటప్పుడు ప్లాస్టిక్ బియ్యం ఉపయోగిస్తే అది గంజిలో కలవదు. నీళ్లు వేడిగా ఉండటం వల్ల ముద్దలుగా మారుతుంది. ఒకవేళ అన్నం ముద్దలుగా ఉంటే బియ్యాన్ని పైన తెలిపిన విధంగా టెస్ట్ చేయండి.
ఈ టిప్స్ పాటించడం వల్ల దాదాపు మనం ఉపయోగించే బియ్యం నాణ్యమైనవా ? లేదా నకిలీవా ? అనేది తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.