Hemant Soren ED News : భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దిల్లీ నివాసం నుంచి రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. రెండు కార్లను సైతం సీజ్ చేసినట్లు వెల్లడించాయి. వారం రోజుల క్రితం సోరెన్ రాంచీ నుంచి దిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించేందుకు సోమవారం దిల్లీలోని సోరెన్ ఇంటికి వెళ్లింది ఈడీ. సోరెన్ అందుబాటులో లేని నేపథ్యంలో ఆయన రాక కోసం దాదాపు 13 గంటల పాటు ఎదురుచూసింది. అయితే, సోరెన్ అక్కడ లేకపోవడం వల్ల ఇంట్లో సోదాలు నిర్వహించింది. హరియాణా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఓ బీఎండబ్ల్యూ సహా మరో కారు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. బీఎండబ్ల్యూ కారు బినామీ పేరు మీద ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. నేరానికి సంబంధించి కొన్ని పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వివరించాయి.
భార్యకు పగ్గాలు?
కాగా, హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా- జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర నాయకత్వ మార్పు ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. తన సతీమణికి సోరెన్ సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ శాసనసభ్యులు అంతా లగేజీతో సోమవారం రాంచీకి చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు మంగళవారం వీరు సీఎం నివాసంలో సమావేశం కానున్నారు. కొన్నిరోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలపై ఝార్ఖండ్ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. సోరెన్ పరారయ్యారని ఆరోపించింది.
'తన ఎమ్మెల్యేలను హేమంత్ సోరెన్ రాంచీకి పిలిపించుకున్నారు. హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్‌కు సీఎం బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయని మాకు సమాచారం అందింది. ఈడీ విచారణకు ముఖ్యమంత్రి భయపడుతున్నారు. రోడ్డు మార్గంలో దిల్లీ నుంచి రాంచీకి వస్తానని సోరెన్ తన పార్టీ నేతలకు చెప్పినట్లు మాకు తెలిసింది' అని బీజేపీ నేత నిషికాంత్ దూబే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బుధవారం విచారణకు హాజరు!
కాగా, సోరెన్ వ్యక్తిగత పని మీద వెళ్లారని సమాచారం. మంగళవారం మధ్యాహ్నానికి ఆయన రాంచీ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ కోసం జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని ఇప్పటికే ఈడీకి సందేశం పంపించారు సోరెన్. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
లాలూపై ఈడీ ప్రశ్నల వర్షం- 9గంటలకుపైగా సుదీర్ఘ విచారణ
ఇన్సూరెన్స్‌లో నామినీగా చేర్చలేదని SDM హత్య- కట్టుకథతో బయటపడేందుకు భర్త యత్నం