Helicopters Demand In India : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మెుదలైంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలకు తుది రూపునిస్తున్నాయి.
అయితే రాజకీయ నేతల ప్రచారాలు మరింత ఊపందుకుంటున్న నేపథ్యంలో ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది డిమాండ్ 40 శాతం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిక్స్‌డ్-వింగ్ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు అధిక గిరాకీ ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకునే అవకాశం ఉండటం వల్లే హెలికాప్టర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వివరించారు.
హెలికాప్టర్లు సరిపడా లేవ్!
ప్రస్తుతానికి విమానాలు, హెలికాప్టర్లు గిరాకీకి సరిపడా లేవని క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రంజన్ మెహ్రా వెల్లడించారు. అధిక డిమాండ్ నేపథ్యంలో కొంతమంది వీటిని లీజుకు తీసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఛార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ సేవలకు ఛార్జీలను గంటల లెక్కన వసూలు చేస్తారు. విమాన ఛార్జీ గంటకు 4 లక్షల 50 వేల రూపాయల నుంచి 5 లక్షల 25వేల రూపాయలు వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అదే హెలికాప్టర్‌కు అయితే గంటకు లక్ష 50 వేల రూపాయలు వరకు వసూలు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి.
పది కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నవే!
2023 డిసెంబరు నాటికి దేశంలో 112 నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తుంటాయి. స్థిరంగా ఒక మార్గంలో సర్వీసులను నడపవు. ఈ సంస్థల దగ్గర దాదాపు 350 విమానాలు, 175 వరకు హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు పది కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నవేనని చెబుతున్నారు.
ఎంతైనా ఇచ్చేందుకు రెడీ!
ఈ పరిశ్రమలో మధ్యవర్తులు కూడా ఉంటారని నిపుణులు తెలిపారు. వారు ముందుగానే కొన్ని గంటల సేవలను బుక్ చేసుకొని తిరిగి వాటిని డిమాండ్‌ను బట్టి కస్టమర్లకు విక్రయిస్తారని వెల్లడించారు. ఈసారి గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్లకు గరిష్ఠంగా గంటకు 3 లక్షల 50 వేల వరకు చెల్లించడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు.
బీజేపీ అలా- కాంగ్రెస్ ఇలా
2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ అకౌంట్లలో హెలికాప్టర్లు లేదా విమానాల సేవలకు దాదాపు 250 కోట్ల రూపాయలు వరకు చెల్లించినట్లు అధికార బీజేపీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రయాణ ఖర్చుల కింద ఆ సంవత్సరం 126 కోట్లుగా లెక్క చూపింది.