- 14.58 PM
బీజేపీ ఎంపీ నాయబ్ సైనీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించమని కోరారు.
- 14.02 PM
హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కురుక్షేత్ర ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన నాయబ్ సైనీని మంగళవారం జరిగిన సమావేశంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. అంతకుముందు అనిల్ విజ్ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
- 12.09 PM
హరియాణా ముఖ‌్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎంతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు అందరూ రాజీనామాలు సమర్పించినట్లు బీజేపీ నేత కన్వర్ పాల్ గుజ్జర్ తెలిపారు. గవర్నర్ రాజీనామాలకు ఆమోదం కూడా తెలిపినట్లు చెప్పారు. అయితే మనోహర్ లాల్ ఖట్టర్ లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. బీజేపీ అధిష్ఠానం సూచనతో కొత్త నేత ముఖ్యమంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
-
VIDEO | Manohar Lal Khattar (@mlkhattar) leaves from Governor's house in Chandigarh after resigning as Haryana CM. pic.twitter.com/51KJZqGcbl
— Press Trust of India (@PTI_News) March 12, 2024
- 11.54AM
హరియాణా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు జరిగాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను గవర్నర్ బండారు దత్రాత్రేయకు సమర్పించారు. ఈ రోజే(మంగళవారం) కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. రేసులో నయబ్‌సైనీ ఉన్నట్టు సమాచారం.
- 11.51AM
- హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రాజీనామా
- రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించిన ఖట్టర్
- స్వతంత్రుల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు ఖట్టర్ ప్రయత్నాలు
- లోక్‌సభ ఎన్నికల ముందు హరియాణాలో కీలక పరిణామాలు
- బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలతో విభేదాలు
- హుటాహుటిన హరియాణా వెళ్లిన అర్జున్ ముండా, తరుణ్ చుగ్
11.47AM
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేబినెట్ మంత్రులందరూ గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించారని పేర్కొన్నాయి.
Haryana Politics News : సార్వత్రిక ఎన్నికల ముంగిట హరియాణాలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-జననాయక్ జనతా పార్టీ-JJP ప్రభుత్వంలో చీలికలు ఏర్పడ్డాయి. మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. హరియాణాకు నూతన ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అర్జున్ ముండా, బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్ హుటాహుటిన హరియాణా వెళ్లారు. బీజేపీ-జేజేపీ చీలిపోయినా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండదని భావిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్‌కు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ-JJP కూటమిలో చీలిక మొదలైనట్లు ముఖ్యమంత్రి ఖట్టర్‌తో సమావేశమైన స్వతంత్ర శాసనసభ్యుడు నయన్ పాల్ రావత్ చెప్పారు. మరో స్వతంత్ర ఎమ్మెల్యే ధర్మపాల్ గోడర్ సైతం ఖట్టర్‌కే మద్దతు పలికారు.
90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు,హరియాణ లోక్‌హిత్ పార్టీ-HLPకి చెందిన ఒకఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ-JJPకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీతో విభేదాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై JJP దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రి అయిన దుష్యంత్ చౌతాలా ప్రభుత్వం ఇచ్చిన కాన్వాయ్‌ను తిప్పి పంపినట్లు సమాచారం.