పంజాబ్-హరియాణా సరిహద్దు శంభు మరోసారి ఉద్రిక్తంగా మారింది. చలో దిల్లీ పిలుపులో భాగంగా రైతులు తిరిగి ప్రారంభించిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులు వాటిని దాటుకొని వెళ్లే ప్రయత్నం చేయగా- పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో కొందరు కర్షకులు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈరోజుకు చలో దిల్లీ పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో 101మంది రైతులు చలో దిల్లీ పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు. పంజాబ్-హరియాణా సరిహద్దు శంభు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కొందరు గాయపడగా- రైతులు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున చలో దిల్లీ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని ఈ ఉదయం తెలిపారు. దీంతో హరియాణా ప్రభుత్వం భారీగా పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించింది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రైతులు తిరిగి పాదయాత్ర మొదలుపెట్టేందుకు సిద్ధం కాగా... అనుమతి ఉంటే చూపించాలని హరియాణా పోలీసులు కోరారు. రైతులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు కదలారు. పోలీసులు మరోసారి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో శంభు ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.