Hamas Chief Haniyeh Funeral : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఖమేనీ ఆదేశాలిచ్చినట్లు కీలక అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. హనియా హత్యకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగితే పశ్చిమాసియాలో మరో యుద్ధం జరగనుంది.
ఎవరు దాడి చేసినా భారీ మూల్యం తప్పదు
ఇరాన్ హెచ్చరికలపై ఇజ్రాయెల్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై ఎవరు దాడి చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి 10 నెలలవుతోంది. హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా సహా మరికొన్ని తీవ్రవాద సంస్థలతో ఇరాన్ దాడి చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచి యుద్ధం విరమించేలా చేయాలనేది ఇరాన్ ప్రణాళిక అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సిరియాలోని ఇరాన్ దౌత్యకార్యాలయంపై ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపించుకున్నాయి.
నివాళులర్పించిన ఇరాన్ అధ్యక్షుడు
టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో హనియా, ఆయన అంగరక్షకుడి శవపేటికల వద్ద ఖమేనీ నివాళులర్పించారు. ఆయన వెంట ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా ఇతర ముఖ్య నేతలున్నారు. శుక్రవారం హనియా అవశేషాలను ఖననం కోసం ఖతార్‌కు తరలించనున్నారు.
ఇదీ జరిగింది
ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ ప్రమాణ కార్యక్రమానికి హాజరై టెహ్రాన్‌లో తన నివాసానికి చేరుకున్న హనియాపై క్షిపణి దాడి జరిగింది. ఇది ఇజ్రాయెల్ పనేనని హమాస్, ఇరాన్ ఆరోపిస్తున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌లో హెజ్‌బొల్లా ఉగ్రవాద కమాండర్ ఫాద్ షుక్ర్‌యే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది. హనియాను హత్య చేయడాన్ని హమాస్‌తో పాటు లెబనాన్, యెమెన్, రష్యా, చైనా, ఖతార్, మలేసియా ఖండించాయి.