Gujarat Floods 2024 : గుజరాత్‌లో వరుసగా నాలుగోరోజూ వర్షం పలు జిల్లాలను ముంచెత్తింది. వర్షాలు, వరదల కారణంగా గోడకూలి, నీటిలో మునిగిన వేర్వేరు ఘటనల్లో గుజరాత్‌వ్యాప్తంగా ఇప్పటివరకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 8,500మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు కారణంగా రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. గుజరాత్ సీఎంకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | Gujarat | Slum areas in Vadodara's Akota submerged in water following incessant heavy rainfall in the city pic.twitter.com/t5vfw7eTs0
— ANI (@ANI) August 28, 2024
అస్తవ్యస్తమైన వడోదర
ముఖ్యంగా వర్షాలు, వరదలకు వడోదర అస్తవ్యస్తమైంది. విశ్వమిత్రి నది ఉద్ధృతికి వరద నీరు అంతా నగరంలోకి చేరుకుంది. అనేక వాహనాలు నీట మునిగాయి. చాలా కాలనీలు నీటిపై తేలుతున్నాయి. విశ్వమిత్రి నది పరివాహంలోని అనేక ఇళ్లు ఇంకా నీటిలోనే మునిగి నానుతున్నాయి. నవసారిలో 3 వేల మందిని, వడోదర, ఖేడాలో వెయ్యి మంది చొప్పున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మచ్చు డ్యామ్ తెరిచిన కారణంగా మోర్బిలో వరద పోటెత్తినప్పటికీ పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై వరద నీటి ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వరద ఉద్ధృతి నేపథ్యంలో ఒక వంతెనను మూసివేశారు. అహ్మదాబాద్‌లోని గోద్రెజ్ సిటీ సమీపంలో అనేక రోడ్లు నీట మునిగాయి.
#WATCH | Gujarat | Following incessant heavy rainfall in Vadodara, the city is facing severe waterlogging in places.
— ANI (@ANI) August 28, 2024
Visuals from Akota pic.twitter.com/tpGMrTBe9S
#WATCH | Gujarat | Over 30 gates of Morbi located Machhu-II dam have been opened to release water as the region continues to receive heavy rainfall pic.twitter.com/FG9NoAWlAY
— ANI (@ANI) August 27, 2024
ఒక్క రోజులోనే అతి భారీ వర్షాలు
సౌరాష్ట్ర ప్రాంతంలోని జిల్లాల్లోనే వరద ప్రభావం ఎక్కువగా ఉంది. బుధవారం ఉదయం ఆరు గంటలకు నమోదైన వర్షపాతం ప్రకారం దేవభూమి ద్వారక, జామ్‌నగర్, రాజ్‌కోట్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో అతి భారీ వర్షాలు కురిశాయని గుజరాత్ అత్యవసర నిర్వహణ కేంద్రం డేటా తెలిపింది. దేవభూమి ద్వారక జిల్లాలోని ఖంబాలియాతాలూకాలో 45 సెంటీమీటర్ల కుండపోత కురిసింది. జామ్‌నగర్ నగరంలో 38 సెంటీమీటర్లు, జామ్‌నగర్ జిల్లాలోని జమ్‌జోధ్‌పుర్ తాలూకాలో 32.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 251 తాలూకాల్లో 13 చోట్ల వర్షపాతం 20 సెంటీమీటర్లకుపైగా నమోదైనట్లు అధికారులు వివరించారు.
#WATCH | Gujarat | Following incessant heavy rainfall in Jamnagar, the city is facing severe waterlogging in places.
— ANI (@ANI) August 28, 2024
Several houses submerged in water; normal life affected pic.twitter.com/obXzLyHKwR
రైళ్లు రద్దు
భారీ నుంచి అతి భారీ వర్షాలకు గుజరాత్‌లోని 137 జలాశయాలు, సరస్సులు, 24 నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలపైనా వరదలు ప్రభావం చూపుతున్నాయి. వందే భారత్ సహా 8 రైళ్లు రద్దయ్యాయి. మరో 10 పాక్షికంగా రద్దు చేశారు. విశ్వమిత్రి నది వరదతో అల్లాడుతున్న వడోదరలోని లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. మోర్బీ, ఆనంద్, దేవభూమి ద్వారక, రాజ్‌కోట్, వడోదర జిల్లాల్లో ఐదు పటాలాల సైన్యం సహాయ చర్యల్లో పాల్గొంటోంది.
వరద పరిస్థితిపై మోదీ ఆరా
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి వర్షాలు, వరద పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర తరపున అన్నిరకాలుగా సాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చారని సీఎం భూపేంద్ర పటేల్ ఎక్స్‌లో వెల్లడించారు. గుజరాత్ ప్రజలు ఎప్పుడూ మోదీ గుండెల్లో ఉంటారని, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ఆపద సమయంలో అయినా ప్రధాని రాష్ట్రానికి అండగా నిలుస్తారని పటేల్ పేర్కొన్నారు.