Green House In Mysore : ఏపుగా పెరిగిన చెట్లు, పచ్చని గోడను తలపించేలా తీగలు. చూడడానికి ఎంతో బాగున్నాయి కదూ! అందులో వింత ఏముంది? చాలా చూశాం అని అనుకుంటున్నారా? ఆ పచ్చటి చెట్ల మధ్య ఓ అద్భుతమైన రెండంతస్తుల భారీ భవనం ఉందని గమనించారా? అదే ఈ ఇంటి ప్రత్యేకత. అందుకే ఎండాకాలంలోనూ చల్లగా ఉందంటున్నారు యజమాని. ఈ చెట్ల వల్ల గోడలకు రంగుల ఖర్చు కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు.
కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన బెంజమిన్ 20 ఏళ్ల క్రితం మైసూరుకు వలస వచ్చారు. అక్కడే ఓ ఇంటిని నిర్మించుకుని, దాని చుట్టూ పచ్చని చెట్లను పెంచడం ప్రారంభించారు. ఇలా సుమారు 10 వేల రకాల తీగలు, చెట్లను ఇంటి చుట్టూ పెంచి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. ద్రాక్ష వంటి పండ్లు, ఆయుర్వేద మందుల్లో వినియోగించే తీగలు మొదలు సుమారు 190 రకాల వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి. ఇంట్లోనే ఓ చిన్నపాటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు బెంజమిన్.
"ఈ ఇల్లు నిర్మించి సుమారు 20 ఏళ్లు అవుతోంది. గత 10ఏళ్లుగా ఇంటి చుట్టూ అనేక రకాల చెట్లు, తీగలను పెంచుతున్నాను. ఇందులో మొత్తం సుమారు 10వేల రకాల వివిధ మొక్కలు, తీగలు ఉన్నాయి. పాములు, దోమలు, క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండే విధంగా కూడా కొన్ని మొక్కలను నాటాను. వీటి వల్ల వాతావరణం చల్లగా మారి అనేక పక్షులు ఇంట్లోనే గూడు కట్టుకుని జీవిస్తున్నాయి. ఈ ఇంటిని ఓ చిన్న మ్యూజియంలాగా కూడా మార్చాను. సుమారు 150 పురాతన విగ్రహాలు, చిత్రపటాలు, బొమ్మలు, చేతివృత్తులను సేకరించాను. విదేశీ బొమ్మలను సేకరించి ఇంట్లో ప్రదర్శనకు ఉంచాను."
--బెంజమిన్, ఇంటి యజమాని
పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ ఇంట్లో వేసవి కాలంలోనూ ఎలాంటి ఏసీ, కూలర్లను వినియోగించట్లేదు బెంజమిన్. కేవలం చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. ఈ తీగలు ఎక్కువ తేమను కలిగి ఉంటాయని బెంజమిన్ తెలిపారు. శీతాకాలం, వర్షాకాలంలో నెలకు ఒక్కసారి నీరు పోసినా సరిపోతుందని, వేసవిలో మాత్రం వారానికి ఒకసారి తప్పక నీటిని అందించాలని వివరించారు. మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు సైతం ఇక్కడికి వస్తుంటారని తెలిపారు. ఈ పచ్చటి చెట్ల నుంచి వచ్చే గాలిని పీలిస్తే ఎలాంటి రోగాలు రావని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు బెంజమిన్.