PM Modi Urges Governors : గవర్నర్లు కేంద్రం, రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. సామాజిక సంస్థలు, ప్రజలతో సంభాషించాలని, అణగారిన వర్గాల వారిని కలుపుకొనిపోయేలా చూడాలని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన దిల్లీలో శుక్రవారం ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో ప్రధాని ఈ మేరకు ప్రసంగించారు. రాజ్యాంగం పరిధిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసేందుకు గవర్నర్ పదవి చాలా దోహదపడుతుందని మోదీ అన్నారు.
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తూ, దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అన్ని రాష్ట్రాలు, అక్కడ ఉన్న కేంద్ర సంస్థలు మెరుగైన సమన్వయంతో పనిచేయడం అవసరమన్నారు. ఆయా రాష్ట్రాల్లో సంబంధిత సమన్వయాన్ని పెంపొందించేందుకు మార్గాలు అన్వేషించాలని గవర్నర్లకు సూచించారు. ఐక్యతాభావం మరింత పెరిగేలా చూడాలన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర న్యాయచట్టాలు దేశం ఆలోచనాధోరణిలో మార్పునకు సంకేతాలని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేలా రూపొందించిన జాతీయ విద్యావిధానం సమర్థంగా అమలయ్యేలా రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల కులపతుల హోదాలో తమవంతు కృషిచేయాలని గవర్నర్లను కోరారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమ్మిళిత అభివృద్ధి కోసం ఆలోచనలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ‘అమ్మ పేరుతో ఒక మొక్క’, ‘మై భారత్’, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమాలను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గవర్నర్ల సదస్సులో ప్రసంగించారు. ఈ రోజు (శనివారం) కూడా సదస్సు కొనసాగనుంది. ఇందులో భాగంగా గవర్నర్లు ఉప గ్రూపులుగా ఏర్పడి, కేంద్రం-రాష్ట్రాల సంబంధాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు సహా పలు అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరపనున్నారు.
***
రోడ్ కారిడార్ ప్రాజెక్ట్
దేశంలో 8 కీలక జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యం, కనెక్టివిటీలను మెరుగుపరచేందుకు రూ.50,655 కోట్లతో 936 కిలోమీటర్ల పొడవున్న రోడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ 8 హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,42,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ ఎక్స్‌వేదికగా తెలిపారు. దేశ మౌలిక సదుపాయాలకు ఈ ప్రాజెక్టులు పరివర్తనాత్మక ప్రోత్సాహాన్ని అందిస్తాయని ప్రధాని అభివర్ణించారు. భారత ఆర్థిక వృద్ధిపై ఇది గుణాత్మక ప్రభావాన్ని చూపించడమే కాక, ఉపాధి అవకాశాలను పెంచుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ దేశ నిర్మాణంతో పాటు అనుసంధానిత భారత్ పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుందని మోదీ రాసుకొచ్చారు.
ISS యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఎంపిక
'తల్లీ బిడ్డల కోసం రైళ్లలో బేబీ బెర్తులు' - అశ్వినీ వైష్ణవ్