Government School Deposit 1000 in The Name of Students : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కొన్నిచోట్ల పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా విద్యార్థులను ఆకట్టుకునేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు కర్ణాటక ఉపాధ్యాయులు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.వెయ్యి చొప్పున పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
దావణగెరె జిల్లా చన్నగిరి తాలుకాలోని కెంగెపుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఈ పాఠశాలను మూసివేసి, ఉపాధ్యాయులను మరో స్కూల్‌కు బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకునే ప్రతిపాదన వచ్చింది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా పిల్లలను పాఠశాలలో చేర్పించే విధంగా డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు ఉపాధ్యాయులు.
'ఎడ్యుకేషన్ ఫ్రీ- డిపాజిట్ గ్యారంటీ'
ఎడ్యుకేషన్ ఫ్రీ- డిపాజిట్ గ్యారంటీ అనే నినాదంతో విద్యార్థుల పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.వెయ్యి జమ చేయనున్నట్లు ప్రకటించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు జీబీ చంద్రాచారి, టీచర్ లక్ష్మీ నారాయణ వెల్లడించారు. ఈ పథకాన్ని అంతకుముందు నుంచి చదువుతున్న విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని వివరించారు.
"ప్రభుత్వ పాఠశాలను కాపాడేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి సంబంధించిన కరపత్రాలను ముద్రించాం. త్వరలోనే చుట్టుపక్కల గ్రామాల్లో పంచుతాం. దీనికి బ్లాక్ ఎడ్యూకేషన్ ఆఫీసర్ కూడా అనుమతి ఇచ్చారు."
--లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయుడు
దాతల సహాయంతో!
విద్యార్థుల ఖాతాల్లో డిపాజిట్ చేసే మొత్తాన్ని దాతల సహాయంతో సేకరిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. కెంగెపురకు చెందిన పూర్వ విద్యార్థి, కర్ణాటక పబ్లిక్ స్కూల్ ఇంఛార్జ్ ప్రిన్సిపల్ గణేశ్ నాయక్‌ను సంప్రదించగా రూ.50వేలు దానం చేశారు. డాక్టర్ రాజానాయక్ సైతం పాఠశాల మైదానం అభివృద్ధి కోసం రూ.2లక్షలు ఇస్తానని చెప్పినట్లు టీచర్ తెలిపారు. శివ నాయక్ సైతం రూ.25వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు.
"నేను కెంగెపుర ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నాను. మా స్కూల్లో ఎన్రోల్మెంట్ రేట్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసమే మా నాన్న హనుమాన్ నాయక్ జ్ఞాపకార్థం పాఠశాలకు రూ.50వేలు ఇస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లగా మార్చేందుకు కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించాం" అని దాత గణేశ్ నాయక్ అన్నారు.