Google Doodle on Earth Day 2024 : ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 22న ఎర్త్ డే దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ సంవత్సరం గూగుల్(Google).. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన డూడుల్‌ను ఆవిష్కరిస్తుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 22(ఇవాళ) ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అందరినీ ఆకర్షించేలా సరికొత్త డూడుల్‌ను రూపొందించింది. ఆ డూడుల్.. భూమిని భద్రంగా ఉంచితేనే మానవ మనుగడ అని గుర్తు చేసేలా అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది.
ధరిత్రి దినోత్సవం 2024 సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ డూడుల్ చూడ్డానికి ఫొటోల్లాగే కనిపిస్తున్నా.. అందులో 'G O O G L E’ అనే అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని కొద్దిసేపు ప్రత్యేకంగా గమనిస్తే ఆ అక్షరాలను చూడొచ్చు. అయితే.. చాలా మందికి అవి ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన చిత్రాలుగా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ, అవి ఎడిట్ చేసిన చిత్రాలు కాదు. భూమిపై నిజంగా ఉన్న ప్రదేశాలే అవి.
వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో గుర్తుచేసేలా.. ఎర్త్ డే 2024 సందర్భంగా గూగుల్(Google) ఈ ప్రత్యేక డూడుల్‌ను తీసుకొచ్చింది. ఇందులో కనిపిస్తున్న ఒక్కో అక్షరం ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు ఆ ప్రాంతాలు కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి మార్పులకు లోనయ్యాయో వివరించేలా.. శాటిలైట్ చిత్రాల ద్వారా యానిమేషన్‌ను కూడా జోడించింది గూగుల్. ఆ డూడుల్‌పై క్లిక్ చేస్తే మీరు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పొందవచ్చు. ఇకపోతే ఈ డూడుల్‌లోని అక్షరాలకు అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
PHD చేస్తారా? నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేస్తే చాలు- PG అక్కర్లేదు! - UGC NET Exam Rules
- G : డూడుల్‌లో కనిపిస్తున్న తొలి అక్షరం 'G'ని పోలి ఉన్న ప్రదేశం.. టర్క్స్ అండ్ కైకోస్ దీవులు. ఈ ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలోని అంతరించిపోతున్న అనేక జీవులకు రక్షణగా ఉంటోంది. అంతేకాదు, ఈ ప్రదేశం జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉంది.
- O : డూడుల్‌లోని రెండో అక్షరం 'o' మెక్సికోలోని స్కార్పియన్ రీఫ్ నేషనల్ పార్క్‌ని సూచిస్తుంది. పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందిన ఈ జీవావరణ కేంద్రం యునెస్కో గుర్తింపు పొందింది. ఇది అంతరించిపోతున్న అనేక పక్షులు, తాబేళ్లకు కేంద్రంగా ఉంది.
- O : ఐస్‌లాండ్‌లోని వట్నాజోకుల్ నేషనల్ పార్క్‌కు సంబంధించిన ప్రాంతాన్ని సూచిస్తుంది డూడుల్‌లోని మూడో చిత్రం. ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. అగ్నిపర్వతాలు, మంచు మిశ్రమంతో అరుదైన ప్రకృతి దృశ్యాలు, వృక్షజాలానికి నెలవుగా ఈ ప్రాంతం ఉంది.
- G : డూడుల్‌లోని నాలుగో చిత్రం బ్రెజిల్‌లోని జౌ నేషనల్ పార్క్. అమెజాన్ అడవుల మధ్యలోని ఈ ప్రాంతం అనేక అరుదైన జంతువులకు నివాసంగా ఉంది.
- L : నైజీరియాలోని గ్రేట్ గ్రీన్వాల్ను సూచిస్తుంది డూడుల్‌లో ‘ఎల్’ చిత్రం. ఈ ప్రాంతంలో ఎడారికీకరణ వల్ల కోల్పోయిన వైభవాన్ని మొక్కలు నాటడం ద్వారా పునరుద్ధరిస్తున్నారు. స్థానిక ప్రజలకు ఇది ఉపాధి కల్పిస్తోందట.
- E : ఇక చివరగా డూడుల్‌లోని లాస్ట్ పిక్చర్.. ఆస్ట్రేలియాలోని పిల్బరా ఐలాండ్స్ నేచర్ రిజర్వ్స్‌కు సంబంధించిన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇది ఆంగ్ల అక్షరమైన ‘e’ని పోలి ఉంది. అనేక సముద్ర తాబేళ్లు, పక్షులు సహా పలు జీవులకు ఈ ప్రాంతం నివాస స్థలంగా ఉంది.
- ఆయా ప్రాంతాల ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు వివిధ సంస్థలు, స్థానికులు కలిసి చేస్తున్న కృషిని గుర్తిస్తూ గూగుల్ (Google).. ఈ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించడం విశేషం.
'బస్సు అంత పొడవున్న పాము'- ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ అవశేషాలను కనుగొన్న సైంటిస్ట్‌లు