Deaths Due To Air Pollution In India : అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఇష్టారీతిన ధ్వంసం చేస్తుండటం వల్ల గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. ఫలితంగా వాయుకాలుష్యం జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతోంది. నీళ్లు కలుషితమవుతున్నా ఫిల్టర్ చేసి ఉపయోగిస్తుండటం వల్ల దాని ప్రభావం మానవులకు తెలియడం లేదు. అదే గాలి విషయంలో మాత్రం స్పష్టంగా కనపడుతోంది. వాయుకాలుష్యం కారణంగా భారత్‌లో ప్రతి రోజు 464 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు మృతిచెందుతున్నారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది.
అదే ప్రపంచంలో అయితే 2 వేల మంది చిన్నారులు మృతి చెందుతున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మరణాల్లో వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని వెల్లడించింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్, యూనిసెఫ్ సంస్థలు సంయుక్తంగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదికను రూపొందించాయి. 90 శాతం వాయుకాలుష్య మరణాలకు గాలిలో ఉండే పీఎం 2.5 అతిసూక్ష్మ ధూళికణాలే కారణమని నివేదిక పేర్కొంది.
పేద, మధ్య ఆదాయ దేశాలే వాయుకాలుష్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నాయని నివేదిక పేర్కొంది. వాయుకాలుష్యం కారణంగా ఆ దేశాల్లోని చిన్నారులే ఎక్కువగా మరణిస్తున్నారని తెలిపింది. ఇంధనాలను మండించడం వల్ల వాయుకాలుష్యం అధికమవుతోందని వెల్లడించింది. 2021లో 50 లక్షల పిల్లల మరణాలకు ఇంధనాల వల్ల తలెత్తిన వాయికాలుష్యమే ప్రధాన కారణమని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తులను కాల్చడం, వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, థర్మల్ విద్యుత్కేంద్రాలు, ట్రాఫిక్ వాయుకాలుష్యానికి ప్రధాన కారణాలని తెలిపింది. వాయుకాలుష్యం కారణంగా భారత్‌లో ప్రజల సగటు ఆయుర్దాయం మూడు సంవత్సరాలు తగ్గిపోతోందని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది.
ఉత్తర భారత్‌లోని దిల్లీలాంటి ప్రాంతాలలో అయితే సగటు ఆయుర్దాయం 5.4 సంవత్సరాలు తగ్గిపోతోందని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేధిక వెల్లడించింది. వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు, శీతాకాలంలో కాలుష్యాన్ని ఎదుర్కొంనేందుకు గురువారం దిల్లీ ప్రభుత్వం పలు శాఖలతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. వింటర్ యాక్షన్ ప్లాన్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భారత్‌లో వాయుకాలుష్య మరణాలు పోషకాహారలోపం కన్నా 1.3 రెట్లు, మద్యపానం, పొగతాగడం కన్నా 4.4 రెట్లు అధికంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణం పర్యావరణ చట్టాలలో సంస్కరణలు తీసుకొనిరావాలని కమిటీ పేర్కొంది.
IVF ద్వారా పిల్లలు కనేవారికి వాయు కాలుష్యంతో ఇబ్బందులు- అన్నీ లింకే!