Garlic Field CCTV : వెల్లుల్లి పంటను దొంగల నుంచి కాపాడుకునేందుకు సీసీటీవీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు రైతులు. కేజీ వెల్లుల్లి ధర రూ.500 దాటిన నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొలాల్లో పలు చోట్ల కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటున్నారు. వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఛింద్వాడాలోని మోహ్ఖేడ్లోని రైతులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
"రైతులకు వెల్లుల్లి పంట ఈ ఏడాది మంచి లాభాలు ఇచ్చేలా ఉంది. మార్కెట్లో వెల్లుల్లి పంటకు మంచి ధర వస్తోంది. అదే సమయంలో వెల్లుల్లి చోరీకి గురవుతుందన్న భయాలు సైతం ఉన్నాయి. చోరీ జరిగిన ఘటనలు సైతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రైతులు తమ పొలాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత దొంగతనాలు ఆగిపోయాయి. పొలాల్లో పని చేసే కూలీలను కూడా చూసుకోగలుగుతున్నాం."
-రాహుల్ దేశ్‌ముఖ్, యువ రైతు
పంటను బయటకు తీసిన తర్వాత కెమెరాలను తొలగించినట్లు రైతులు చెబుతున్నారు. 'పొలాల్లో నేను కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చాను. వెల్లుల్లిని తీసిన తర్వాత కెమెరాలు తొలగించాను. కెమెరాలకు సాధారణ విద్యుత్ కనెక్షన్ అవసరం లేదు. సోలార్ పవర్‌తో అవి పని చేస్తాయి. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగుతుంది. రైతులు పొలంలో లేకపోయినా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. సీసీటీవీలో ఓ సిమ్ కార్డు, హెచ్డీ కార్డు అమర్చుతాం. హెచ్డీ కార్డులో వీడియో రికార్డు అవుతుంది' అని గజానంద్ దేశ్‌ముఖ్ అనే మరో రైతు వివరించారు.
ఛింద్వాడాలో లక్షా 30 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు పండుతాయి. ఈ ఏడాది వెల్లుల్లిని మాత్రం 1500 హెక్టార్లలోనే పండించారు రైతులు. విస్తీర్ణం పరంగా గతేడాది కంటే ఇది చాలా తక్కువ. రైతులకు గతేడాది సరైన గిట్టుబాటు ధర దక్కని నేపథ్యంలో ఈ సంవత్సరం వెల్లుల్లి పంట వేసేందుకు చాలా మంది వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెల్లుల్లికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు పంటను కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 5 నుంచి 7 గ్రామాల రైతులు తమ పొలాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
చిన్న ఊరిలో 100 CCTV కెమెరాలు- ప్రెసిడెంట్ చొరవతో ఫుల్ సెక్యూరిటీ!
ఒకేసారి 1.33 కోట్లమంది సూర్య నమస్కారాలు- వరల్డ్ రికార్డ్ దాసోహం!