Bomb Threat To Air India Flight : ముంబయి నుంచి బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం గురువారం తిరువనంతపురంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ బాంబు బెదిరింపుతో అలర్ట్ అయిన అధికారులు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రస్తుతం బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌తో సహా భద్రతా సహా భద్రతా ఏజెన్సీలు తనిఖీ చేపట్టాయి.
మొత్తం 135 మంది ప్రయాణికులతో ఎయిర్ఇండియా విమానం ముంబయి నుంచి తిరువనంతపురం బయలుదేరింది. ఉదయం 7:30 గంటలకు తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సమయంలో పైలట్‌కు బాంబు గురించి సమాచారం అందినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. "విమానం వాష్‌రూమ్‌లోని టిష్యూ పేపర్‌పై 'బాంబ్ ఇన్ ఫ్లైట్' అని రాసి ఉంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, 7.36 గంటలకు ఎయిర్‌పోర్టులో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ తర్వాత విమానం ఉదయం 8 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయియింది. వెంటనే దాన్ని ఐసోలేషన్ బేకు తరలించాం. ఉదయం 8.44 గంటలకల్లా ప్రయాణికులు సురక్షితంగా విమానం నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ప్రయాణికులు ప్రస్తుతం తమ లగేజీ డెలివరీ కోసం వేచిచూస్తున్నారు." అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విమానాశ్రయ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో వాస్తవమెంత? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.