Boy Fell In Borewell Rajasthan : రాజస్థాన్‌లో ఆడుకుంటూ వెళ్లి 175 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. 55 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఎట్టకేలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ, అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ దీపక్ శర్మ పేర్కొన్నారు. ఆర్యన్‌కు రెండు సార్లు ఈసీజీ ఇచ్చారని, అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. అంతకుముందు బోరుబావిలో పడిపోయిన 13 గంటల తర్వాత బాలుడి కదలికలను కెమెరా ద్వారా చివరిగా గుర్తించినట్లు రెస్క్యూ సిబ్బంది చెప్పారు.
#WATCH | Deepak Sharma, Chief Medical Officer, Government District Hospital Dausa says, " the child was brought here so that we could try and revive him if possible...we did ecg twice and the child has been declared dead" https://t.co/ixiCmYgJug pic.twitter.com/M1uOoaGbgU
— ANI (@ANI) December 11, 2024
అసలేం జరిగిందంటే?
దౌసౌ జిల్లాలోలని కలిఖఢ్ గ్రామంలో డిసెంబర్ 9 (సోమవారం) మూడు గంటల సమయంలో ఆర్యన్ తన తల్లితో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. అనుకోకుండా ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతున్న బోరుబావిలో ఆర్యన్ ఒక్కసారిగా పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అధికారులకు సమచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దేవేంద్ర యాదవ్ అక్కడికి చేరుకుని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించారు.
తొలుత NDRF, SDRF బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్ ద్వారా ఆర్యన్‌ను బయటకు తీయడానికి చాలాసార్లు ప్రయత్నించాయి. కానీ విజయం సాధించలేకపోయాయి. పలు విధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా అయిపోయింది. ఆ తర్వాత పైలింగ్ మిషన్‌తో బోరుబావికి 4 నుంచి 5 అడుగుల దూరంలో 4 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు అధికారులు. 150 అడుగుల తవ్వకం పూర్తయిన తర్వాత, NDRF సిబ్బంది అందులో దిగి సొరంగం తవ్వి బాలుడి వద్దకు చేరుకున్నారు. అలా ఆర్యన్‌ను దాదాపు మూడు రోజులకు బయటకు తీసుకొచ్చారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆర్యన్ మరణించినట్లు వైద్యులు ధ్రవీకరించారు.