Fire Cracker Factory Blast In Tamilnadu : తమిళనాడు విరుధనగర్ జిల్లాలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడం వల్ల తొమ్మిది మంది చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. శివకాశి సమీపంలోని సెంగమలపట్టి సమీపంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి గాయపడిన వారిని శివకాశి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాణసంచా నిల్వ ఉంచిన ఏడు గదులు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీకి బాణసంచా మేకింగ్ లైసెన్స్ ఉందని చెప్పారు.
మోదీ ట్వీట్
శివకాశీ సమీపంలోని జరిగిన పేలుడ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "శివకాశిలోని కర్మాగారంలో జరిగిన దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు ఆవేదన చెందాను. నా ఆలోచనలు ప్రస్తుతం మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
ముర్ము స్పందన
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. శివకాశి సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. "మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు ముర్ము. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధనఖడ్ కూడా పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఈసీ నుంచి అనుమతులు వచ్చాక!
విషాదకరమైన ఘటనలో విలువైన ప్రాణాలను కోల్పోవడం తనను తీవ్రంగా బాధించిందని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని జిల్లా అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు పొందిన తర్వాత (జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున) రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయం చేస్తుందని తెలిపారు.
గదిలో ఎక్కువ మంది ఉండటం వల్లే!
"ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది కార్మికులు మరణించారు. 10 మంది గాయపడ్డారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది" అని విరుధనగర్ పోలీసు సూపరింటెండెంట్ కె ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా తెలిపారు. శిక్షణ పొందని కార్మికులను నియమించడం లేదా గదిలో ఎక్కువ మంది ఉండటం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు బాణాసంచా తయారీదారులకు మూడు రోజుల క్రితమే పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించిట్లు తెలిపారు.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఏడుగురు దుర్మరణం- మరో ఏడుగురు సీరియస్!