Father Life Imprisonment : కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చేటట్లు చేసిన ఓ వ్యక్తికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది కోర్టు. అలాగే రూ.లక్ష జరిమానాను సైతం వేసింది. కేరళ మలప్పురం జిల్లాలోని మంజేరీ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు(2) న్యాయమూర్తి ఎస్ రష్మి 41 ఏళ్ల దోషికి ఈ శిక్షను వేశారు.
అసలేం జరిగిందంటే?
అరికోడ్‌కు చెందిన దోషికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో బాధితురాలు జన్మించింది. ఆమెకు 10 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి బాధితురాలిపై తండ్రి నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో ఆమె తనపై జరిగిన దారుణాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు.
అయితే బాధితురాలు అనారోగ్యానికి గురవ్వడం వల్ల ఆమె తండ్రి ఆరికోడులోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పుడు బాధితురాలు గర్భవతి అని వైద్య పరీక్షల్లో తేలింది. వెంటనే ఆమెను అరికోడ్ ఆస్పత్రి నుంచి కోజీకోడ్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. వైద్యుల సలహా మేరకు కోజీకోడ్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి అబార్షన్ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఆ తర్వాత తనపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రిపై బాధితురాలు అరికోడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని 2023 ఏప్రిల్ 8న అరెస్టు చేశారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం అబ్బాస్ అలీ, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం కబీర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె స్వయంప్రభ విచారణ జరిపి చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడు బాధితురాలిని బెదిరిస్తాడని, కేసు విచారణ పూర్తయ్యే వరకు అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని అభ్యర్థించారు. దీంతో కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేయలేదు.
ఈ కేసుపై విచారణ జరిపిన మంజేరీ మంజేరీ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు(2), దోషికి పోక్సో చట్టంలోని సెక్షన్ 5(జే) కింద రూ.25,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు, సెక్షన్ 5(ఎం) కింద రూ.25 వేలు ఫైన్‌తోపాటు 25ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఇలా పలు సెక్షన్ల కింద 104 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.లక్ష జరిమానా వేసింది. నిందితుడు జరిమానా చెల్లిస్తే దాన్ని బాధితురాలికి అందించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏఎన్ మనోజ్ కోర్టు ఎదుట 22 మంది సాక్షులను విచారించారు. 24 పత్రాలను కోర్టు ముందుంచారు. తీర్పు అనంతరం నిందితుడిని తవనూరు సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు.
తండ్రికి లివర్ డొనేట్ చేసేందుకు కూతురు రెడీ- కానీ కోర్టు పర్మిషన్ కోసమే వెయిటింగ్!