Family Loses Their Only Son in Fire Accident : కుమారుడి మృతదేహాన్ని సంచిలో పట్టుకుని అంతిమ దహన సంస్కారాలకు తీసుకెళ్లాడు ఓ తండ్రి. ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కుమారుడు సజీవ దహనమయ్యాడు. దీంతో ఎముకలు, బూడిదే మిగిలింది. ఈ క్రమంలో తీవ్రంగా రోదిస్తూ కుమారుడి అస్తికలను సంచిలో తండ్రి తీసుకెళ్లడం హృదయాలను కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
యల్లప్ప గుండియాగోల(20) అనే యువకుడు బెళగావిలోని నవేజ్ గ్రామ సమీపంలోని స్నేహం అనే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితమే ఫ్యాక్టరీలో హెల్పర్‌గా చేరాడు. యల్లప్ప తల్లిదండ్రులిద్దరూ వృద్ధులు. అలాగే అతడికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వీరందరూ యల్లప్ప తీసుకొచ్చే జీతంతోనే బతుకుతున్నారు. ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో యల్లప్ప సజీవ దహనమయ్యాడు. కుమారుడు ఇంటికి వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు యల్లప్ప మరణవార్త తెలిసింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే యల్లప్ప సోదరీమణులు సైతం గుండెలు పగేలలా ఏడ్చారు.
ఫ్యాక్టరీ లిఫ్టులో సజీవ దహనం
మంగళవారం రాత్రి నుంచి యల్లప్ప ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలించగా, బుధవారం ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఫ్యాక్టరీ లిఫ్టులో యల్లప్ప సజీవదహనమై కనిపించాడు. కుమారుడి అస్థిపంజరాన్ని చూసిన అతడి తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. పోస్టుమార్టం పరీక్షల తర్వాత యల్లప్ప శరీర బాగాలను ఓ వస్త్రంలో చుట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం యల్లప్ప తండ్రి అతడి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని అంత్యక్రియలకు బయల్దేరిన దృశ్యం హృదయాలను కలచివేసింది. గ్రామస్థులు, బంధువులు యల్లప్ప మృతదేహాన్ని చూసి విలపించారు.
యల్లప్ప కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిందే!
యల్లప్ప ఇంటి బాధ్యతను చూసుకునేవాడని అతడి బంధువు బసవరాజు పెండారి ఈటీవీ భారత్ కు తెలిపారు. అతడి తల్లిదండ్రులు వృద్ధులని, ఒక సోదరికి వివాహం జరిగిందని, మరో ఇద్దరికి పెళ్లి కావాల్సి ఉందని పేర్కొన్నారు. యల్లప్ప మృతి అతడి కుటుంబానికి తీరని లోటు అని వెల్లడించారు. స్నేహం ఫ్యాక్టరీలో పనిచేసి అందులోనే మరణించిన యల్లప్ప కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీయూసీ చదివిన తర్వాత కుటుంబం కోసం యల్లప్ప ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాడని తెలిపారు.