Farmers Protest Delhi : తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం దిల్లీ చలో పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను నిలిపి ఉంచారు. అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు.
నెలరోజులపాటు 144 సెక్షన్
రైతుల ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ సోమవారం దిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం నెల రోజుల పాటు దిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని పోలీసులు వెల్లడించారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. పోలీసు శాఖ సూచనలు అనుసరించి ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
-
#WATCH | Delhi Police Commissioner Sanjay Arora arrives at Ghazipur border to inspect security arrangements here ahead of the farmers' call for March to Delhi on 13th February. pic.twitter.com/kT4McpdfYk
— ANI (@ANI) February 11, 2024
దిల్లీకి 20 వేల మంది రైతులు
దిల్లీ చలోలో పాల్గొనకుండా నివారించేందుకు ఖాప్ పంచాయతీలు, పలు గ్రామాల సర్పంచులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది రైతులు దిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ ఆందోళనలను ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్ నిర్వహించాయని తెలిపాయి. కొందరు రైతులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ ముండా సహా పలువురు బీజేపీ సీనియర్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.
ఇంటర్నెట్, టెలికాం సేవలు బంద్
మరోవైపు రైతుల ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే హరియాణాలోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. ఈ నెల 13 వరకు అన్ని టెలికాం సేవలపై ఆంక్షలు విధించారు.
చర్చలకు రండి : కేంద్రం
దిల్లీ చలోకు తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో కిసాన్, జవాన్ నాశనమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోపైపు రైతుల ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం మరో దఫా చర్చలు జరిపేందుకు వారిని ఆహ్వానించింది.
మోదీపై రాహుల్, ప్రియాంకా ఫైర్
దిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో పోలీసులు ఏర్పాటు చేసిన క్రేన్లు, బారీకేడ్లు, ముళ్లకంచెలు వంటి వాటికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎక్స్‌లో షేర్ చేశారు. రైతుల పట్ల ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అన్నదాతలపై ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి తరిమికొట్టాలని మండిపడ్డారు.
'ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?'
కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి రైతు సంఘాలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొననున్నాయి. 'ప్రభుత్వం ఓ వైపు చర్చలకు ఆహ్వానిస్తూనే సరిహద్దుల వెంబడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. సరిహద్దులు మూసివేశారు. 144వ సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఎక్కడిది? ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలకు అవకాశం ఉండదు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించాలి' అని రైతు నాయకుడు జగ్‌జిత్ సింగ్ దాలెవాల్ అన్నారు.
ఖతార్‌లోని నేవీ అధికారులు రిలీజ్- ఏడుగురు భారత్‌కు రిటర్న్- మోదీకి థ్యాంక్స్
బిహార్‌లో టెన్షన్ టెన్షన్! మరికొద్ది గంటల్లో బలపరీక్ష- ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీల తంటాలు!