Farmers Protest Delhi 2024 : డిమాండ్ల సాధన కోసం దిల్లీ చలో పేరుతో దేశ రాజధాని ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చండీగఢ్‌లో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ముగిసేవరకు రైతులు దిల్లీ వైపు కదలరని కర్షక సంఘం నేతలు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా దిల్లీ చలో కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నాయి. రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు. కాగా, ఇదివరకు జరిగిన రెండు విడతల చర్చలు విఫలమయ్యాయి.
'కొత్తగా మేమేం డిమాండ్ చేయలేదు'
అయితే కర్షకులు కొత్త డిమాండ్లు చేస్తున్నారన్న కేంద్రం వాదనను అన్నదాతలు ఖండించారు. తమ డిమాండ్లు ఏవీ కొత్తకావని రైతు సంఘం నేత జగ్జిత్ సింగ్ తెలిపారు. "మా డిమాండ్లు మేం ఇంతకు ముందు సమర్పించిన 'డిమాండ్ చార్ట్'లో ఉన్నాయి. కొత్తగా మేమేం డిమాండ్ చేయలేదు. గత సమావేశం విఫలమైన తర్వాత, ప్రభుత్వం మళ్లీ సమావేశానికి పిలుపునివ్వడాన్ని చూస్తుంటే కొంత సానుకూల పరిష్కారాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది" అని చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రమంత్రుల భేటీ
రైతుల ఆందోళన నేపథ్యంలో సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముండా సమావేశమయ్యారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన రాజ్‌నాథ్ సింగ్, రైతు సమస్యలపై అర్జున్ ముండాతో చర్చించినట్లు తెలుస్తోంది. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తుండగా అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాల్సి ఉందని తొందరపడి దీనిపై ఒక నిర్ణయానికి రాలేమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం
పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి బుధవారం ఉదయం బాష్పవాయువు ప్రయోగం జరిగింది. హరియాణా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని రైతులు పేర్కొన్నారు. హరియాణా జింద్ జిల్లాలోని సింగ్‌వాలా-ఖనౌరీ సరిహద్దు వద్ద కూడా ఇదే తరహా ప్రతిష్టంభన నెలకొని ఉంది. ట్రాక్టర్లపై పంజాబ్ నుంచి వచ్చిన రైతులను దిల్లీకి వెళ్లకుండా హరియాణా పోలీసులు అడ్డుకుంటున్నారు.
అనేకమందికి గాయాలు
ఇంకా పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు శంభు సరిహద్దుకు తరలివస్తూనే ఉన్నారు. పంజాబ్ వైపు జాతీయ రహదారిపై ఈ ట్రాక్టర్లు భారీగా క్యూ కట్టి ఉన్నాయి. పంజాబ్ సరిహద్దు దాటి హరియాణాలోకి ప్రవేశించేందుకు రైతులు మరోసారి యత్నించగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మంగళవారం రైతులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా పదుల సంఖ్యలో గాయపడ్డారు.
దిల్లీలో భద్రత కట్టుదిట్టం
రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చే రహదారులను తెరిచి ఉంచిన దిల్లీ పోలీసులు, హరియాణా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంల్లో మాత్రం పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సింఘ్, టిక్రీ సరిహద్దుల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బారికేడ్లను పెట్టారు.
రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచాయి. మరోవైపు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని హరియాణా పోలీసులకు తేల్చి చెప్పారు.
దిల్లీకి భారీగా రైతులు- హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత- కర్షకులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం
రణరంగంలా 'దిల్లీ చలో'- బారికేడ్లు తొలగించి దూసుకెళ్తున్న రైతులు! చర్చలకు సిద్ధమన్న కేంద్రం