Farmers Protest Chalo Delhi Update : పంటలపై కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఫిబ్రవరి 29వ తేదీ వరకు హరియాణా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల వద్దే నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ విషయాన్ని కర్షకుల ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) శుక్రవారం రాత్రి ప్రకటించాయి.
"దిల్లీ చలోపై ఈ నెల 29వ తేదీన నిర్ణయం తీసుకుంటాం. ఆ లోపు 24వ తేదీన కొవ్వొత్తుల ర్యాలీ, 26వ తేదీన కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తాం" అని కేఎంఎం నేత శర్వాణ్ సింగ్ పంధేర్ తెలిపారు. దేశ రాజధాని దిల్లీ వైపు ప్రయత్నించిన రైతులను గత 11 రోజులుగా భద్రతా బలగాలు హరియాణా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల వద్ద నిలువరించాయి.
శుభకరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే
యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ బుధవారం జరిగిన ఘర్షణల్లో మరణించడం వల్ల ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. ఖనౌరీ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై హరియాణా పోలీసులు అడ్డగించారు. వారిపై పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తేనే అంత్యక్రియలు
రైతు శుభ్‌కరణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ రూ.కోటి ప్రకటించారు. అయినా రైతు నేతలు శాంతించలేదు. మృతికి కారణమైన హరియాణా పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తేనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. నిరసనలో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు.
వెనక్కితగ్గిన హరియాణా సర్కార్
రైతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న హరియాణా ప్రభుత్వం కాస్త మెత్తబడింది. వారికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. హరియాణా సీఎం ఖట్టర్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్టెట్‌లో పంటరుణాలపై వడ్డీని మాఫీ చేశారు. మరోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు.
కేంద్రంతో చర్చలకు రైతులు 'నో'- శుక్రవారం 'బ్లాక్ డే'గా పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి
'దిల్లీ చలో'లో ఉద్రిక్తత- రైతులపైకి టియర్ గ్యాస్- కర్షకులతో చర్చలకు కేంద్రం పిలుపు