Gun Powder Factory Blast In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ బెమెతెరా జిల్లాలోని గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు జరగడం వల్ల 17 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రాయ్‌పుర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అలాగే బెమెతెరా కలెక్టర్ రణ్‌బీర్ శర్మ్ ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇంకా లీక్ అవుతున్న గ్యాస్!
పేలుడు సంభవించిన గన్ పౌడర్ ఫ్యాక్టరీ వద్దకు రాయ్‌పుర్, దుర్గ్ అగ్నిమాపక దళాలు, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు తర్వాత కూడా ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవుతుందని రెస్క్యూ బృందాలు తెలిపాయి. మరోవైపు, గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వందల అడుగుల ఎత్తులో ఉన్న కరెంట్ తీగలు కూడా కాలిపోయాయని పేర్కొన్నారు. అలాగే ఒక విద్యుత్ స్తంభం కూడా కూలిపోయిందని చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో ఉన్న గన్ పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గ్రామంలోని చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. అలాగే దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల ఫ్యాక్టరీ వద్ద వేలాది మంది ప్రజలు భారీగా గుమిగుడారు. వారు తీవ్ర ఆగ్రహంతో ఫ్యాక్టరీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. పేలుడు తర్వాత శిథిలాల కింద కొందరు ఉండిపోయినట్లు సమాచారం.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
గన్ పౌడర్ ఫ్యాక్టరీ పేలుడు ప్రమాదంలో గాయపడినవారిని త్వరగా ఆస్పత్రికి తరలించేందుకు అన్ని విధాలా సాయం చేస్తామని రాయ్‌పుర్ ట్రాఫిక్ డీఎస్పీ గుర్జిత్ సింగ్ తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకురావడంలో ఎలాంటి సమస్య ఉండకూడదని అన్నారు. క్షతగాత్రులను తీసుకువస్తున్న అంబులెన్స్‌కు ట్రాఫిక్ లేకుండా చేశామని ఈటీవీ భారత్‌కు చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోందని ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు.