Exit Poll 2024 Lok Sabha : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపడుతుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. కనిష్ఠంగా 281, గరిష్ఠంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోందని తేల్చాయి. ఇక బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న బంగాల్‌లో కమలదళం సత్తా చాటుతుందని చెప్పాయి. ఒడిశాలోనూ నవీన్ పట్నాయక్‌కు బీజేపీ షాక్ ఇస్తుందని అంచనాలు వేశాయి. ఇక దక్షిణాదిలో బీజేపీ కంచుకోట అయిన కర్ణాటకలో కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెప్పాయి. తమిళనాడులో 'ఇండియా' కూటమి పార్టీలు తమ పట్టు నిలుపుకొంటాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కేరళ, తమిళనాడుల్లో కాషాయ పార్టీ ఖాతా తెరిచే అవకాశం ఉందని అంచనా. కాగా, రాజస్థాన్, బిహార్, హరియాణాల్లో మాత్రం బీజేపీ కొన్ని సీట్లు కోల్పోతుందని పేర్కొన్నాయి.
బెంగాల్‌లో బీజేపీ భేష్!
బంగాల్‌లో బీజేపీ సత్తా చాటుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, సందేశ్‌ఖాళీ అకృత్యాలు, ఓటుబ్యాంకు రాజకీయాలే విమర్శనాస్త్రాలుగా దూసుకెళ్లిన కమలదళం, ఈ ఎన్నికల్లో మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. 2019 ఎన్నికల్లో 42 స్థానాల్లో 18 సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీ, ఈసారి మరిన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీకి 21-26, టీఎంసీకి 16-18 వరకు సీట్లు వస్తాయని జన్‌కీ బాత్ తెలిపింది. రిపబ్లిక్ భారత్- మ్యాట్రిజ్ 21-25, 16-20 సీట్లుగా పేర్కొంది. ఇండియా న్యూస్-డీ-డైనమిక్స్ బీజేపీకి 21, టీఎంసీకి 19 వస్తాయని చెప్పింది.
కర్ణాటకలో కాషాయ రెపరెపలు
కర్ణాటకలో మరోసారి బీజేపీదే పైచేయిగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, లోక్‌సభ పోరులో ఓటర్లు కాషాయ పట్టం కట్టినట్లు సర్వేల్లో వెల్లడవుతోంది. రాష్ట్రంలో మొత్తం 28 సీట్లు ఉన్నాయి. చాలా వరకు సర్వేలు ఎన్డీయేకు 20-26 మధ్య వస్తాయని అంచనావేశాయి. కాంగ్రెస్ 3-7 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించాయి.
ఒడిశాలో నవీన్‌కు సెట్‌బ్యాక్
లోక్‌సభ ఫలితాల్లో ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు షాక్ తగిలే అవకాశం ఉందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 21 స్థానాల్లో బీజేపీ 13-18 సీట్లలో విజయం సాధిస్తుందని వెల్లడైంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన బిజూ జనతాదళ్, ఈసారి 3-8 సీట్లకే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 'జన్‌కీ బాత్' కాషాయ పార్టీకి 15-18, బీజేడీకి 3-7, 'ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్' 15-17, 4-6 సీట్లు, 'న్యూస్ 24-టుడేస్ చాణక్య' బీజేపీకి 16, బీజేడీకి 4 సీట్లు వస్తాయని పేర్కొంది.
తమిళనాడుపై 'ఇండియా'దే పట్టు
39 స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్ కూటమిదే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 28- 38 వరకు సీట్లు వస్తాయని తెలిపాయి. రాష్ట్రంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోన్న బీజేపీ, ఈ ఎన్నికల్లో మరో తొమ్మిది ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టింది. ఈ క్రమంలోనే ఎన్డీయేకు 1-5 సీట్లు వస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. ఒంటరిగా పోటీ చేస్తోన్న ఏఐఏడీఎం 1-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేరళలో యూడీఎఫ్ జోరు
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సత్తా చాటుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఎన్డీయే కూటమి తొలిసారి ఇక్కడ బోణి కొట్టనుందని సర్వేలు పేర్కొన్నాయి. మొత్తం 20 స్థానాల్లో యూడీఎఫ్‌కు 15-18, ఎన్డీయేకు 1-3, అధికార ఎల్డీఎఫ్‌కు 0-4 వస్తాయని చెప్పాయి.