Champai Soren Joins BJP : ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం! మాజీ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఝార్ఖండ్ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో చంపాయీ సోరెన్ తన మద్దతుదారులతో కలిసి పార్టీలో చేరారు. కాషాయ పార్టీలోకి స్వాగతించిన తర్వాత సోరెన్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది.
జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చంపాయీ, కొంతకాలంగా ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంపాయీ వైదొలగారు. సీఎం పగ్గాలు మళ్లీ హేమంత్ సోరెన్ చేతికి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో సొంత పార్టీ అధినాయకత్వంపై చంపాయీ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
VIDEO | Former Jharkhand CM and former JMM leader Champai Soren (@ChampaiSoren) joins BJP along with this supporters at an event in Ranchi. #ChampaiSoren pic.twitter.com/vdZmKwVm3g
— Press Trust of India (@PTI_News) August 30, 2024
పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని చంపాయీ ఇటీవల వాపోయారు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయిన ఆయన, జేఎంఎం ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందన్న చంపాయీ తాజాగా బీజేపీలో చేరిపోయారు.
ఎవరీ చంపయీ సోరెన్?
చంపయీ సోరెన్ సెరైకెల్లా నియోజవకర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై సేవలందించారు. హేమంత్ సోరెన్ కేబినెట్ లో రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన చంపయీ సోరెన్ ఝార్ఖండ్ టైగర్‌గా పేరొందారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు. 1956లో జిలింగోరా గ్రామంలో చంపయీ సోరెన్ జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు. శిబు సోరెన్‌తో ఎటువంటి బంధుత్వం లేదు.