ED Raids In Ranchi : లోక్‌సభ ఎన్నికల వేళ ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం పీఏ పనిమనిషి ఇంట్లో రూ.25 కోట్ల నగదును జప్తు చేశారు ఈడీ అధికారులు. ఈ డబ్బు మంత్రి పీఏ సంజీవ్ లాల్‌కు చెందినదని పని మనిషి జహీంగీర్ ఆలం ఈడీ అధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.
మనీలాండరింగ్ కేసు విషయంలో రాంచీలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో భాగంగా ఈడీ అధికారులు మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో సోదాలు జరిపారు. ఈ క్రమంలో అతడి ఇంటి నుంచి రూ.25 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేంటీ కేసు?
రాంచీలోని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని వారికి పనులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈడీ వీరేంద్ర కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. అంతేగాక ఈ అక్రమ ధనాన్ని వీరేంద్ర కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగించిందని ఈడీ అప్పట్లో పేర్కొంది. ఝార్ఖండ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఫిర్యాదు మేరకు వీరేంద్రపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి 2023 ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ కేబినెట్ ఆలంగీర్ ఆలం(70) గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల్లో ఆలంగీర్ ఆలం ఒకరు. ఆయన పాకుర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఆయన పీఏ పని మనిషి ఇంట్లో రూ.25 కోట్ల నగదు సీజ్ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
'అధికార పార్టీ అవమానకరమై రోజు'
ఝార్ఖండ్‌లోని అధికార పార్టీ ఈ రోజును అవమానంగా భావిస్తుందని రాష్ట్ర బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాశ్ అన్నారు. అలాగే ఝార్ఖండ్‌ను 'లూట్ఖండ్'గా మార్చే పనిలో కాంగ్రెస్, ఆర్జేడీ, ముక్తి మోర్చా ఉన్నాయని విమర్శించారు. మరోవైపు ఝార్ఖండ్ ప్రభుత్వ అవినీతి అంతం అయ్యే సూచనలు కనిపించడంలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో అన్నారు. 'ఇటీవలే ఓ కాంగ్రెస్ ఎంపీ ఇళ్లు, కార్యాలయం నుంచి రూ.300 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు రూ.25 కోట్లకు పైగా జప్తు చేశారు. ఆలంను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి' అని ప్రతుల్ షా పేర్కొన్నారు.
కుమారుడు మూగవాడని మొసళ్లున్న కాలువలో విసిరేసిన తల్లి- చివరికి! - Mother Throws Mute Son In Canal
ఎన్నికల వేళ అయోధ్యకు మోదీ- రామయ్య దర్శనం- భారీ రోడ్ షో - lok sabha election 2024