Eco Sensitive Zone Notification : వయనాడ్‌లో విషాదం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో దాదాపు 56వేల చదరపు కిలోమీటర్ల పరిధిని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటిస్తూ ఐదో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేరళ వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన 13 గ్రామాలు సహా మొత్తం 9వేల 993 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు, గుజరాత్‌ల్లోని పర్యావరణ సున్నిత ప్రాంతాలు దీని కిందకు వస్తుందని తెలిపింది. ఈ ముసాయిదా ప్రకారం ఆయా ప్రాంతాల్లో మైనింగ్, క్వారీ, ఇసుక తవ్వకాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు జరుగుతుంటే వచ్చే ఐదేళ్లలో దశల వారీగా వాటికి ముగింపు పలుకుతారు. నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్రం కోరింది.
'ఇంతటి భయంకర విషాదాన్ని ఎన్నడూ చూడలేదు'
కేరళలో ఒకే ప్రాంతంలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం వయనాడ్ జిల్లా యంత్రాంగంతో ఆయన సమావేశమయ్యాను. ఆ ప్రాంతంలో జరిగిన ప్రాణ, ఆర్థిక నష్టం గురించి అధికారులు రాహుల్‌కు వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. 'కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బాధితులకు 100 ఇళ్లు నిర్మించాలని అనుకుంటున్నా. మిగతా ఘటనల వాటి మాదిరిగా కాకుండా దీనిని భిన్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అలాగే ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా' అని రాహుల్ గాంధీ అన్నారు.
వయనాడ్ బాధితుల కోసం మానసిక నిపుణుల బృందం
మరోవైపు ఈ ఘటనలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడ్ పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వీరంతా సహాయక శిబిరాలు, ఆస్పత్రుల్లో ఉన్న బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణీలకు, చిన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఫోన్ ద్వారా కూడా నిపుణులతో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం 24 గంటలు పాటు అందుబాటులో ఉండేలా 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు.
వయనాడ్‌కు ప్రముఖుల ఆపన్నహస్తం- ఒక్కొక్కరు రూ.5కోట్లు ఇచ్చిన బిజినెస్మెన్
వయనాడ్ విపత్తు నుంచి కుటుంబాన్ని కాపాడిన 'ఆవు'- లేకుంటే అంతా మట్టిలోనే! - Wayanad landslides