70 Needles In Girl Head : ఒడిశాలోని బలంగీర్ జిల్లాకు చెందిన ఓ యువతి తలలో ఉన్న 70 సూదులను వైద్యులు తొలగించారు. సీటీ స్కానింగ్ ద్వారా సూదులను గుర్తించిన డాక్టర్లు, రెండు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్సను నిర్వహించి ఆమెను ప్రాణాలతో కాపాడారు. బాలిక తలలోకి సూదులు చొప్పించిన తాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బలంగీర్ జిల్లాలోని సింధేకెలా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం విచిత్రంగా ప్రవర్తించింది. తన చేతిని పలుమార్లు కోసుకుంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, ఆమె ఆరోగ్యంగానే ఉందని ధ్రువీకరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ అలానే ప్రవర్తించింది. అప్పుడు యువతికి దెయ్యం పట్టిందని భావించి తాంత్రికుడి వద్ద తీసుకెళ్లాడు తండ్రి.
ఆ సమయంలో చికిత్స పేరుతో యువతి తలలోకి ఓ సూది చొప్పించాడు తాంత్రికుడు. అలా కొన్ని నెలలుగా సూదులను చొప్పిస్తూనే ఉన్నాడు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియకుండా జరిగింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమంగా మారింది. దీంతో కుటుంబసభ్యులు గురువారం రాత్రి బలంగిలో భీమ్‌వోయి మెడికల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ సీటీ స్కాన్‌లో యువతి తలలో అనేక సూదులు ఉన్నట్లు తేలింది.
అనంతరం బర్ల భీంసార్‌లో ఉన్న VIMSARకు తరలించారు. అక్కడ 10 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స చేసి యువతి తల నుంచి 70 సూదులను బయటకు తీశారు. "4 సంవత్సరాల క్రితం యువతి అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. యువతి తలపైనుంచి లోపలకు ఒక్కొక్కటిగా సూదులు చొప్పించాడు. ఇది నాలుగేళ్లుగా జరుగుతోంది. యువతి ఆరోగ్యం విషమించడం వల్ల ఆస్పత్రికి తీసుకురాగా శస్త్ర చికిత్స చేసి 70 సూదులు తొలగించారు వైద్యులు. దాదాపు 2 గంటల పాటు సర్జరీ జరిగింది" అని డాక్టర్లు తెలిపారు.
రెండున్నరేళ్ల బాలుడ్ని బలిచ్చిన తాంత్రికుడు.. ఆస్తిపై కన్నేసి..