Dengue Severe symptoms : వర్షాకాలంలో పెరుగుతున్న దోమలతో డెంగీ, మలేరియా జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్ అయితే తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీలో అలాకాదు. ఈ వ్యాధి సోకిందని తెలిపే అనేక లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ సాధారణ, తీవ్రమైన లక్షణాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? అనే విషయాన్ని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేష్ వుక్కాల మాటల్లో తెలుసుకుందాం.
డెంగీ జ్వరం ఎలా సోకుతుంది?
టైగర్ దోమ పగలు పూట కుట్టినపుడు మాత్రమే డెంగీ జ్వరం వస్తుందని డాక్టర్ రాజేష్ తెలుపుతున్నారు. ఈ దోమ కుట్టిన వారం రోజులకు హఠాత్తుగా 104 డిగ్రీల జ్వరం వస్తుందని పేర్కన్నారు. చలి, ఒళ్లునొప్పులు, కంటి వెనకభాగంలో నొప్పి. నీరసం అధికంగా ఉంటుంది. చర్మంపై దురద వస్తుంది. రెండో దశలో జ్వరం తగ్గిన తర్వాత రెండు రోజులకు తెల్లకణాలు, ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి. ఇది కూడా వైరల్ జ్వరం లాంటిదే. వంద మందిలో ఐదారుగురికి మాత్రమే సీరియస్‌గా మారుతుంది. ఒకసారి డెంగీ వచ్చిన వ్యక్తికి మళ్లీ డెంగీ వస్తే మాత్రం తీవ్రత అధికంగా ఉంటుంది.
తీవ్రస్థాయి లక్షణాలు
- పొట్ట ఉబ్బటం, పొట్టలో నొప్పి, ఆయాసం
- రక్తపోటు పడిపోవటం, అపస్మారం
- వాంతులు
- కాళ్లు చేతులు చల్లబడటం
- అస్థిమితం
- చికాకు
- మగత
- చిగుళ్ల వంటి భాగాల నుంచి రక్తం రావటం
- చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు
డెంగీ జ్వరం వచ్చినపుడు పూర్తిస్థాయిలో మందులు వాడాల్సిందేనని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సమయంలో పెయిన్‌కిల్లర్ మందులు వాడకూడదని సలహా ఇస్తున్నారు.
'' డెంగీ రక్తపోటును తగ్గిస్తుంది. కొన్నిసార్లు రక్తస్రావం కూడా అవుతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి. రక్త పరీక్ష చేయించుకుంటే డెంగీ అవునో కాదో తేలిపోతుంది. జ్వరం తగ్గిన తర్వాత చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, కడుపునొప్పి ఉండటం, వాంతులు కావడం లాంటి లక్షణాలు కనిపించగానే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. జ్వరం రాగానే ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. దీనితో రక్తపోటు తగ్గకుండా ఉంటుంది. రోగనిరోధకతను పెంచుకోవడానికి ఆహారం, పండ్లు తీసుకోవాలి. 10-20 వేల కంటే తక్కువకు ప్లేట్‌లెట్లు పడిపోయినపుడే వాటిని ఎక్కించాలి. భయపడొద్దు.'' అని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేష్ తెలిపారు.
డెంగ్యూ నుంచి కోలుకున్నతరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: డెంగ్యూ నుండి కోలుకున్న తర్వాత, ఒక వ్యక్తి చాలా వారాలపాటు అలసట, బలహీనతగా అనిపిస్తుంది. పూర్తిస్థాయిలో కొలుకునే వరకూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. పూర్తిస్థాయిలో తగ్గినట్లుగా అనిపిస్తే మరోసారి వైద్యుడిని సంప్రదించాలి.
విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య - Viral Fevers Tension In AP