7 Flights Get Bomb Threats : దేశీయంగా నడిచే, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం(అక్టోబర్ 15) ఒక్కరోజే ఏకంగా ఏడు విమానాలకు ఎక్స్(ట్విటర్) వేదికగా బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో భద్రతా సంస్థలు, ఉగ్రవాద నిరోధక డ్రిల్స్‌ను నిర్వహించారు. ఈ బాంబు బెదిరింపుల కారణంగా విమానాల రాకపోకల్లోనూ ఆలస్యం, షెడ్యూల్లో మార్పులు జరికాయి.
ఏఏ విమానాలకు అంటే? - మదురై - సింగపూర్, దిల్లీ - షికాగో, జైపుర్ - బెంగళూరు, సహా ఏడు విమానాలకు గంటల వ్యవధిలోనే ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ విమానయాన సంస్థల సిబ్బంది సహా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన కలకలం రేపడంతో అప్రమత్తమైన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) - సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలకు కంప్లైంట్ చేసింది. అనంతరం సంబంధిత ఎక్స్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
అత్యవసర ల్యాండింగ్ - ఈ బాంబు బెదిరింపులు రావడంతో కొన్ని విమానాలు అత్యవసర ల్యాండింగ్ కూడా అయ్యాయి. "దేహ్రాదూన్ నుంచి బయలు దేరిన మా విమానంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విమానానికి భద్రతా ముప్పు పొంచి ఉందని ఆన్‌లైన్‌లో పోస్ట్ కనిపించింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన మా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి బాంబు స్క్వాడ్ వారికి సమాచారం ఇచ్చాం." అని స్పైస్‌జెట్‌కు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.
రెండు రోజుల్లో 10 విమానాలకు - సోమవారం కూడా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబయి నుంచి న్యూయార్క్‌కు బయలు దేరిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతకు ముందుకు మస్కట్, జెడ్డాకు వెళ్లాల్సిన విమానాలకు ఇదే జరిగింది. అలా రెండు రోజుల వ్యవధిలోనే 10 విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లో ఆ బెదిరింపులన్నీ బూటకమని తేలినట్లు సమాచారం అందుతోంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్- పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ డీల్- ఇక ప్రత్యర్థులకు చుక్కలే!