Delhi Rains : దేశ రాజధాని దిల్లీని శుక్రవారం కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోకి వరదనీరు ఉప్పొంగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపైకి వరద నీరు రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల వల్ల దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా, సఫ్దర్ జంగ్ వాతావరణ కేంద్రం 153.7 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదైనట్లు అంచనా వేసింది.
మెట్రో, రైల్వే స్టేషన్ లోకి వరద నీరు
నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందికరమైన మార్గాల వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. శాంతివన్ నుంచి ఐఎస్బీటీ వరకు ఔటర్ రింగ్ రోడ్డు రెండువైపులా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనువర్త మార్గంలో కూడా ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు, దిల్లీ రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల నీటిలో నడిచి వెళ్తున్నారు. దిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలోకి కూడా వరద నీరు చేరడం వల్ల అసౌకర్యానికి గురయ్యారు.
#WATCH | A large portion of Delhi faces severe waterlogging after overnight incessant heavy rainfall.
— ANI (@ANI) June 28, 2024
Visuals from Jangpura and RK Ashram. pic.twitter.com/bT5wVWg0ce
నిలిచిన విద్యుత్ సరఫరా
భారీ వర్షాల కారణంగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ డిస్కమ్ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో కరెంట్ షాక్ ఘటనలు జరగకుండా ముందస్తుగా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
VIDEO | Early morning rain today leads to a heavy traffic jam at Noida-Greater Noida Expressway.
— Press Trust of India (@PTI_News) June 28, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/7rZ9OlxdPX
ఎన్సీఆర్లో గురువారం నుంచి భారీ వర్షాలు
దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ సరితా విహార్, కన్నాట్ ప్లేస్, పాలం విమానాశ్రయం, ధౌలా కువాన్తో సహా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. "ఈ వర్షాల వల్ల రోడ్లు జలమయమయ్యాయి. ఆఫీసుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంది." అని ఐటీ ఉద్యోగి అమన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన వాహనంలోకి నీరు చేరిపోయిందని, గత రెండు గంటలుగా రోడ్డుపైనే ఉండిపోయానని వాపోయాడు ట్రక్కు డ్రైవర్ దినేశ్.
#WATCH | Delhi: Potters who sell clay products on the footpath in Paharganj area, suffer losses as heavy rains wash away their products. pic.twitter.com/zs7G9HeRGl
— ANI (@ANI) June 28, 2024
అప్రమత్తమైన దిల్లీ సర్కార్
దిల్లీలో తాజా పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దిల్లీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు, దిల్లీలో భారీ వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు, తీవ్రమైన వేడి వాతావరణం తర్వాత ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు దిల్లీలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. దిల్లీలో రాబోయే ఏడు రోజుల్లో గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
దిల్లీలో భారీ వర్షం- కూలిన ఎయిర్పోర్ట్ పైకప్పు- ఒకరు మృతి- సర్వీసులు రద్దు - delhi heavy rain