Delhi Fire Accident Today : దిల్లీ శాస్త్రి నగర్ ప్రాంతంలోని 4 అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు బాలికలు, దంపతులు మృతి చెందారు. మనోజ్, ఆయన భార్య సుమన్, ఐదేళ్లు, మూడేళ్లు ఉన్న ఇద్దరు బాలికలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. షాదారా వద్ద ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఉదయం 5గంటల 20 నిమిషాలకు తమకు ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు వివరించారు. 4 అగ్నిమాపక శకటాలు, ఆంబులెన్స్‌తో అక్కడికి చేరుకున్నట్లు చెప్పారు.
భవనం కింద భాగంలో పార్కింగ్ వద్ద నుంచి మంటలు చెలరేగాయని, దీంతో భవనం మొత్తం పొగలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వీధి చిన్నగా ఉండడం వల్ల అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం కష్టమైందని చెప్పారు. అతికష్టం మీద మంటలు ఆర్పిన సిబ్బంది భవనం మొత్తం వెతికారు. ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులను రక్షించి వారిని హెగ్డేవార్ ఆసుపత్రికి తరలించారు. వారిలో దంపతులు, ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- 11మంది మృతి
Delhi Fire Accident : దిల్లీ అలీపుర్‌లోని పెయింట్స్ ఫ్యాక్టరీలో కొన్నాళ్ల క్రితం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
అసలేం జరిగిందంటే?
అలీపుర్‌లోని ఓ రంగుల పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 22 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను రాజా హరిశ్చంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో గాయపడ్డ వారిలో ఒక కానిస్టేబుల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో మొదట పేలుడు సంభవించిందని చెప్పారు. అనంతరం మంటలు చెలరేగాయని వివరించారు. పేలుడు కారణంగా సమీపంలోని ఇళ్లు, దుకాణాలకు సైతం మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న రసాయనాల వల్ల పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.