Delhi Fire Accident : దిల్లీ అలీపుర్‌లోని పెయింట్స్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. నలుగురు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
అసలేం జరిగిందంటే?
అలీపుర్‌లోని ఓ రంగుల పరిశ్రమలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 22 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను రాజా హరిశ్చంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఆస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదంలో గాయపడ్డ వారిలో ఒక కానిస్టేబుల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో మొదట పేలుడు సంభవించిందని చెప్పారు. అనంతరం మంటలు చెలరేగాయని వివరించారు. పేలుడు కారణంగా సమీపంలోని ఇళ్లు, దుకాణాలకు సైతం మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న రసాయనాల వల్ల పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
'ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా సంభవించిన పేలుడు వల్ల సమీపంలోని కొన్ని ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం' అని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి సుమిత్ భరద్వాజ్ తెలిపారు. పేలుడు శబ్దం విన్న తర్వాత స్థానికులంతా చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.
మృతుల కుటుంబాలకు పరిహారం
అలీపుర్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.20 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు. ఘటనాస్థలిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అలాగే దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సైతం పెయింట్ ఫ్యాక్టరీని సందర్శించారు.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
మధ్యప్రదేశ్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో ఇటీవలే పేలుడు సంభవించి 11 మంది మృతి చెందారు. మరో 174 మంది గాయపడ్డారు. ఈ ఘటన హర్దా జిల్లాలో జరిగింది. ఇందౌర్, భోపాల్ నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.