Delhi Chalo Farmers Protest : తమ డిమాండ్లను నెరవేర్చేందుకు తలపెట్టిన 'దిల్లీ చలో' ఆందోళనలకు హరియాణా ప్రభుత్వం అడ్డుపడటాన్ని నిరసిస్తూ గురువారం రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఇందులో భాగంగా దిల్లీ-అమృత్సర్, అమృత్సర్ నుంచి లుథియానాకు వెళ్లే పలు రైళ్లను అడ్డుకుంటామని చెప్పారు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్. దీంతో రైళ్ల రాకపోకలకు 4 గంటలపాటు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.
అంతేకాకుండా పలు టోల్ ప్లాజాల వద్ద కూడా రాస్తారోకులు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమృత్‌సర్‌కు వెళ్లే మార్గంలోని పట్టాల బైఠాయించి నిరసన తెలపనున్నారు రైతులు. మరోవైపు శంభు బార్డర్లో రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఫిబ్రవరి 16(శుక్రవారం) భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.
మంగళవారం ప్రారంభమయిన దిల్లీ చలో మూడో రోజుకు చేరుకుంది. రైతులు తమ ఆందోళనలు విరమించాలని ఇప్పటికే పలు దఫాలుగా రైతు సంఘాలతో చర్చలు జరిపింది. అయితే ఈ భేటీల్లో అన్నదాతల డిమాండ్లను దాదాపు అంగీకరించామని, ఇంకొన్ని వాటిపై ఏకాభిప్రాయం కుదర్లేదని కేంద్ర మంత్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమయింది. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంతోనైనా కనీస మద్దతు ధర సహా ఇతర సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు రైతు నాయకుడు సర్వన్‌సింగ్ పంధేర్. ఈ చర్చల్లో మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూశ్ గోయల్, నిత్యానంద రాయ్ పాల్గొననున్నారు.
'పూర్తి సానుకూల దృక్పథంతో ఈరోజు మంత్రులతో జరగబోయే సమావేశానికి మేము హాజరవుతాం. కనీసం ఈ సమావేశంలోనైనా మా డిమాండ్లను పూర్తిగా విని పరిష్కరిస్తారనే విశ్వాసం మాకుంది. రైతుల సమస్యలపై మా అభిప్రాయాలను మంత్రుల ముందు ఉంచుతాం. ఇది మాకు జీవన్మరణ సమస్య' అని సర్వన్‌సింగ్ పంధేర్ అన్నారు.
'సమావేశం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం'
గురువారం కేంద్రంతో జరిగే చర్చలు ముగిసేంతవరకు దిల్లీ చలోకు సంబంధించి తాము ఏ కొత్త నిర్ణయం తీసుకోమని రైతు నాయకులు ప్రకటించారు. సమావేశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే తన తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. శంభు సరిహద్దులో రైతులు టీ సిద్ధం చేసుకొని తాగుతూ పలువురు రైతులు కనిపించారు. అలాగే మరికొందరు అన్నదాతలు రోడ్డు పక్కనే వంట చేసుకున్నారు.
డ్రైవర్‌లెస్ మెట్రో రైలు- ట్రయల్ రన్‌కు రెడీ- ఎక్కడంటే?
'ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం'- సుప్రీంకోర్టు సంచలన తీర్పు