Cyclone Remal Impact in North Eastern States : బంగాల్‌లో బీభత్సం సృష్టించిన రెమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాల్లో పెను ప్రభావం చూపింది. తుపాను ప్రభావంతో మిజోరంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 27కు పెరిగింది. ఆయిజోల్ శివారు ప్రాంతంలో భారీ వర్షానికి ఓ రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. 8 మంది ఆచూకీ దొరక్కపోవడం వల్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆయిజోల్ సమీపంలోని హ్లిమెన్ వద్ద, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గల్లంతయ్యారు.
రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
మిజోరంలో బుధవారం కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాతి క్వారీ కూలిన ఘటనతో పాటు వర్షాల కారణంగా సంభవించిన విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం లాల్‌దుహోమా ప్రకటించారు. అలాగే రాష్ట్ర విపత్తు సహాయ నిధికి రూ.15 కోట్లు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో మిజోరంలో పాఠశాలలన్నింటికీ సెలవులు ప్రకటించారు. అత్యవసర సేవలు అందిస్తున్న వారు తప్ప మిగతా ఉద్యోగస్థులందరూ ఇంటి నుంచే పని చేయాలని మిజోరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో మిజోరంలో దాదాపు 150 ఇళ్లు ధ్వంసమయ్యాయి. డజన్ల కొద్దీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.
అసోంలో నలుగురు మృతి
రెమాల్ తుపాను ప్రభావంతో అసోంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒక మహిళ సహా నలుగురు మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. కమ్రూప్ జిల్లాలో చెట్టు కూలడం వల్ల లాబణ్య కుమారి అనే 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. మరో చోట చెట్టు కూలడం వల్ల ఓ బాలుడు ప్రాణాలు కోల్పోగా అతడి తండ్రి గాయపడ్డాడు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఒడిశా వెళ్లిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతికూల వాతావరణం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈశాన్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని మంగళవారం రాత్రికి బలహీనపడే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు.
746 మంది నిరాశ్రయులు
రెమాల్ తుపాను ప్రభావంతో కుండపోత వర్షం కురవడం వల్ల త్రిపురలో ఇళ్లలోకి నీరు చేరి 746 మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టం జరగనప్పటికీ, విద్యుత్ వ్యవసాయ రంగాలపై ప్రభావం చూపింది. త్రిపుర సీఎం అగర్తలాలోని సహాయ శిబిరాన్ని సందర్శించారు. ప్రజలకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మేఘాలయలో వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు.
48గంటలు పాటు ప్రధాని మోదీ 'నాన్‌స్టాప్ మెడిటేషన్'- కారణం అదే! - Pm modi kanyakumari